హైదరాబాద్: ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం, 2019 నుండి బీర్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్లు సప్లై నిలిపి వేస్తున్నట్లు ఆ బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కింగ్ ఫిషర్ బీర్ల అంశంపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. బుధవారం (జవనరి 8) ఆయన సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతూ.. బీర్ల రేట్లు పెంచాలని యునైటెడ్ బ్రూవరీస్ కోరింది.
బీర్ల ధరలను 33 శాతం పెంచాలని అడిగింది.. యునైటెడ్ బ్రూవరీస్ చెప్పినట్లు రేట్లు పెంచితే బీర్ల ధరలు భారీగా పెరుగుతాయని తెలిపారు. కంపెనీ కోరినట్లుగా 33 శాతం రేట్లు హైక్ చేస్తే మద్యం ప్రియులపై భారీగా భారం పడుతోందన్నారు. ఈ ధరల పెంపుపై విశ్రాంత హైకోర్టు జడ్జితో ఒక కమిటీ ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ రిపోర్టు వచ్చాక ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
ALSO READ | మందు ప్రియులకు షాక్: తెలంగాణలో KF.. కింగ్ ఫిషర్ బీర్లకు బ్రేక్
కొన్నేండ్లుగా బీర్ల మార్కెట్లో యునైటెడ్ బ్రూవరీస్ గుత్తాధిపత్యం కొనసాగుతోందని.. యూబీఎల్ కంపెనీ మార్కెట్ షేరు 69 శాతం ఉందని తెలిపారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని కంపెనీ ఆరోపిస్తోందని కానీ మేం అధికారంలోకి వచ్చే నాటికే బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.1139 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని తెలిపారు.