
- మండలిలో మధుసూదనాచారి, జూపల్లి మాటల యుద్ధం
- రాష్ట్ర సాధనకు వీరోచితంగా పోరాడారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
- ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదన్న మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ పాలనపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. బడ్జెట్‌పై చర్చలో భాగంగా శుక్రవారం మండలిలో ప్రతిపక్షనేత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడారు. బడ్జెట్ అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయన మహాభారతంలో అర్జునుడి లాంటివారని అభివర్ణించారు. ‘‘రాష్ట్ర సాధనకు కేసీఆర్ వీరోచితంగా పోరాడారు. చిత్తశుద్ధితో పాలన సాగించారు.
మహాభారతంలో చెట్టుపై ఉన్న పక్షి కంటిని మాత్రమే అర్జునుడు చూసినట్లు కేసీఆర్ ఏకాగ్రతతో పాలించారు”అని అన్నారు. దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. ‘‘కేసీఆర్ అర్జునుడు కాదు అవినీతిపరుడు. కేసీఆర్ ఒక్కడివల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. వందల మంది యువకుల ప్రాణత్యాగాలతో రాష్ట్రం సిద్ధించింది. గత ప్రభుత్వంలో చిత్తశుద్ధి, నిజాయతీ పాలన కాదు.. బాధ్యతారహిత పాలన సాగింది’’ అని అన్నారు. జూపల్లి మాట్లాడుతుండగానే కవిత సహా బీఆర్‌ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. బడ్జెట్‌పై మాత్రమే మాట్లాడాలని డిమాండ్ చేశారు.
దీంతో ‘వాస్తవాలు చెప్తుంటే మీకు ఉలుకెందుకు?’ అని జూపల్లి ప్రశ్నించారు. ‘అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరగలేదు’ అని అన్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యంతో బడ్జెట్ పై చర్చ మళ్లీ ప్రారంభమైంది. బడ్జెట్ రూపకల్పన కోసం కేసీఆర్ నెలల తరబడి అన్ని రంగాల అధికారులతో చర్చించేవారని మధుసూదనాచారి అన్నారు. ఏ దేశమైనా సరే అప్పులు చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పదేండ్లలో చేసిన అప్పును.. ఈ ప్రభుత్వం రెండు మూడేండ్లలోనే అధిగమిస్తుందన్నారు.
గత సర్కారు అప్పులకు మేం వడ్డీలు కడుతున్నం
గత ప్రభుత్వం చేసిన తప్పులే మాకు అధికారాన్ని అందించాయి. మా ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం. బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉంది. సంసారం నడపాలంటే అప్పులు, ఆదాయం చూసుకోవాలి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు మేం వడ్డీలు చెల్లిస్తున్నాం. ఆర్థిక సంక్షోభంతో అతి కష్టం మీద ప్రభుత్వం ముందుకు నడుస్తోంది. కేంద్రం కూడా రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. కేసీఆర్ కమీషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు కట్టారు.- మహేశ్‌కుమార్ గౌడ్
బీఆర్ఎస్ ది రుణమాఫీ కాదు.. వడ్డీమాఫీ పథకం
దేశంలో ఎక్కడా లేని మాదిరి రాష్ట్రం ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా, రుణమాఫీ సహా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఆరు గ్యారంటీల్లో 2 మినహా అన్నీ ప్రారంభించాం. బీఆర్ఎస్ ది రుణమాఫీ కాదు.. వడ్డీమాఫీ పథకం
- జీవన్‌రెడ్డి
నిపుణుల సూచనల మేరకే ప్రాజెక్టులు కట్టాలి
వారసత్వంగా వచ్చిన అప్పుల భారం ఈ ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారింది. వాస్తవిక అంచనాలు లేకుంటే బడ్జెట్‌కు అర్థం ఉండదు. ప్ర స్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ఉంది. తుమ్మిడిహెట్టి సహా రాష్ట్రంలో నిర్మించే ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లకు నిపుణుల సూచనల మేరకే ఖర్చు చేయాలి.
- కోదండరాం
విద్యను నిర్లక్ష్యం చెయ్యొద్దు
విద్యను నిర్లక్ష్యం చెయ్యొద్దు. బడ్జెట్‌లో విద్యకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. ప్రైమరీ నుంచి యూనివర్సిటీల వరకు విద్యావ్యవస్థను మెరుగుపరచాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఎందుకు తగ్గుతున్నాయో పరిశీలించాలి. విద్యా కమిషన్ ఏంచేస్తుంది? ఎలాంటి రిఫామ్స్ తెస్తుందన్నది ప్రజలకు వెల్లడించాలి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను సర్కారు ఎలా అధిగమిస్తుందో చెప్పాలి.
- ఏవీఎన్ రెడ్డి