
కొల్లాపూర్, వెలుగు: మహాత్మా గాంధీ, అంబేద్కర్ లను గౌరవించుకోవాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం కొల్లాపూర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రతీ గ్రామంలో పాదయాత్ర చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కించపరుస్తూ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రతీ గ్రామంలో గ్రంథాలయానికి, క్రీడల అభివృద్ధికి రూ.లక్ష చొప్పున కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, మాజీ జడ్పీటీసీ హనుమంతు నాయక్, రామన్ గౌడ్, వల్లభాపూర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఛార్జిషీట్ అప్రజాస్వామికం
ఆమనగల్లు, వెలుగు: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడం అప్రజాస్వామికమని యువజన కాంగ్రెస్ నాయకులు అన్నారు. దీన్ని నిరసిస్తూ ఆదివారం ఆమనగల్లు, తలకొండపల్లి మండల కేంద్రాల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. దేశంలో కాంగ్రెస్ ను బలహీనపరిచే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నాయకులు వస్పుల శ్రీకాంత్, శ్రీశైలం తదితరులున్నారు.
నేటి ప్రజావాణి రద్దు
గద్వాల, వెలుగు: భూ భారతి సదస్సుల నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ నెల 29 వరకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.