కొల్లాపూర్​లో కరెంట్ సమస్య రానీయొద్దు : జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్​లో కరెంట్ సమస్య రానీయొద్దు : జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్​లో విద్యుత్ సమస్య రానీయొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్యాకుమారి అధ్యక్షతన శనివారం జరిగిన రివ్యూ మీటింగ్​కు  ఎంపీ డాక్టర్ మల్లు రవితో కలిసి ఆయన హాజరయ్యారు. సభలో కౌన్సిలర్లు మాట్లాడుతూ..  వీధిలైట్లు లేక ప్రజలు చాలా ఇబ్బందుల పడుతున్నారని, మూడు నెలలుగా కరెంటు సమస్య ఉందని అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని ఆరోపించారు. 

దీంతో అధికారుల పని తీరు మార్చుకోవాలని, మున్సిపాలిటీ పరిధిలో రెండు నెలలుగా ఒక్క లైటూ వేయకుండా రూ.లక్షల బిల్లు ఎలా వచ్చిందని మంత్రి ప్రశ్నించారు. మిషన్ భగీరథ నీళ్లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. గతంలో కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టిలో ఉందన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. 

అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.  అనంతరం ఎంపీ డాక్టర్ మల్లురవిని మున్సిపల్ చైర్మన్ తో పాటు ఆయా శాఖల అధికారులు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో  కౌన్సిలర్లు నర్సింగరావు, బాలస్వామి, రహీం, నహీం, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్​వో వెంకట దాసు, డాక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

కోడేరు: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పెద్దకొత్తపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీ మల్లు రవి, మంత్రి జూపల్లి పాల్గొన్నారు. కొన్ని రోజుల్లో గ్రామాల్లోని సమస్యలను ఆయా విభాగాల అధికారులను పిలిపించి పరిష్కరిస్తామన్నారు. అనంతరం పెద్దకొత్తపల్లి కస్తూర్బా పాఠశాలలో నూతన భవనానికి భూమి పూజ చేశారు .  కార్యక్రమంలో డీఈవో గోవిందు రాజులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.