లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు మొదలుపెట్టండి

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్  పనులు మొదలుపెట్టండి
  • ఇరిగేషన్​ అధికారులకు మంత్రులు జూపల్లి, దామోదర ఆదేశం
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష
  • కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో రిజర్వాయర్లు నిర్మించాలి
  • పాలమూరు ప్రాజెక్టును 2 టీఎంసీల ఫుల్​ కెపాసిటీతో పనులు చేపట్టాలని సూచన

హైదరాబాద్, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా గత ప్రభుత్వం విస్మరించిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ను నిర్మించాలని కాంగ్రెస్​ సర్కారు నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆ రిజర్వాయర్​ పనులు చేపట్టాలని ఇరిగేషన్​అధికారులను మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆదేశించారు. అవసరమైన భూసేకరణ చేపట్టాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ప్రాజెక్టులు, పెండింగ్​ ప్రాజెక్టుల స్థితిగతులపై గురువారం సెక్రటేరియెట్​లో ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్​అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఆ జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి దామోదర రాజనర్సింహ రివ్యూ చేశారు.

జిల్లాలోని ప్రాజెక్టులపై త్వరలో సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష చేయనున్న నేపథ్యంలో.. ముందస్తుగా నిర్వహించిన ఈ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు, విజ్ఞప్తులు, సూచనలను మంత్రులు తెలుసుకున్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ రిజర్వాయర్​పై దృష్టి పెట్టాల్సిందిగా అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. జిల్లాలోని అన్ని పెండింగ్​ ప్రాజెక్టులపై డిటెయిల్డ్​ రిపోర్ట్​ ఇవ్వాలన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమ, సంగంబండ, జూరాల, తుమ్మిళ్ల, ఆర్డీఎస్​, రేలంపాడు ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించాల్సిందిగా సూచించారు. 

కాళేశ్వరంలా ప్రత్యేక కార్పొరేషన్​

కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి 4 లేదా 5 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రులు జూపల్లి, దామోదర ఆదేశించారు. అవసరమైన భూసేకరణ చేయాలని, రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కాళేశ్వరం కార్పొరేషన్​ మాదిరిగా ప్రత్యేక కార్పొరేషన్​ ఏర్పాటు చేసి లిఫ్ట్​ ఇరిగేషన్​ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2 టీఎంసీల ఫుల్​ కెపాసిటీతో పనులు చేపట్టాలని సూచించారు.

డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల రిజర్వాయర్​ నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని ఈపీసీ పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. అన్ని ప్రాజెక్టుల భూ సేకరణ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అవసరమైన సిబ్బందిని కూడా నియమించుకోవాలన్నారు. కాలువల్లో పేరుకుపోయిన జమ్ము, పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రాధాన్య క్రమంలో ఉంచాలన్నారు.

జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్​కొండ వరకు 20 టీఎంసీల వాటర్​ను పంపింగ్​ చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. దాని సాధ్యాసాధ్యాలనూ పరిశీలించాలని మంత్రులు ఆదేశించారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలోని పెండింగ్​ ప్రాజెక్టులు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల పనులకు కావాల్సిన నిధులు, ఇబ్బందులపై సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో నాగర్​కర్నూల్​ఎంపీ మల్లు రవి, ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, వంశీ కృష్ణ, పర్ణికా రెడ్డి, వీర్లపల్లి శంకర్​, వాకిటి శ్రీహరి, రామ్మోహన్​ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మధుసూదన్​ రెడ్డి, తుడి మేఘా రెడ్డి, రాజేశ్​ రెడ్డి, కృష్ణమోహన్​ రెడ్డి, ఇరిగేషన్​సెక్రటరీ రాహుల్​ బొజ్జా, ఈఎన్​సీలు అనిల్​ కుమార్​, నాగేందర్​ రావు, సీఈలు విజయభాస్కర్​రెడ్డి, శ్రీనివాస్​ రెడ్డి, రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.