హైదరాబాద్/ సికింద్రాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక ప్రాంతాల ప్రమోషన్ లో భాగస్వాములు కావాలని యువతకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. చారిత్రక, వారసత్వ కట్టడాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ప్రకృతి–వన్య ప్రాణులు, సాహస కార్యకలాపాలకు అనువైన ఎన్నో ప్రాంతాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. వాటిని సందర్శించి ప్రాచూర్యం కల్పించాలని యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ను కోరారు. అంతర్జాతీయ పర్యాటక వారోత్సవాల్లో భాగంగా బుద్ధవనం థీమ్ పార్కుకు విస్తృత ప్రచారం కల్పించేందుకు చేపట్టిన రైడ్ టు నిర్వాహణ బైక్ ర్యాలీని మంత్రి జూపల్లి ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు.
బేగంపేటలోని టూరిజం ప్లాజా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నాగర్జునసాగర్ బుద్ధవనంలో ముగుస్తుంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ , హైదరాబాద్ బైక్ రైడర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున బైక్ రైడర్స్ పాల్గొన్నారు. తెలంగాణకు విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం గా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కార్యచరణను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు విస్తృత ప్రచారం చేపట్టినట్లు చెప్పారు.
ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రంగా బాసిల్లుతున్న నాగార్జున కొండ, చారిత్రక ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేసి, బౌద్ధ సంస్కృతి వారసత్వాన్ని ఈ తరానికి తెలియజేయాలన్నది తమప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, ఎండీ ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.