ప్రగతిపథంలో ప్రజా పాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

ప్రగతిపథంలో ప్రజా పాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిక్షణం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నదని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, యువత, దళిత, బహుజన వర్గాల ఆర్థిక, సామాజిక వికాసం కోసం పథకాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, భాష సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి రూపొందించిన 80 పాటల సంకలనం ‘ప్రగతి పథంలో ప్రజా పాలన’పుస్తకాన్ని ఆయన బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పథకాలన్నీ ప్రజలకు చేరువ చేయాలని, ఇందుకు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి కళాకారులు రూపొందించిన పాటలు ఎంతో దోహదపడతాయన్నారు. గృహలక్ష్మి, గృహ జ్యోతి, ఉచిత బస్సు పథకం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, యువకులకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, పోటీ పరీక్షల సక్రమ నిర్వహణ వంటి కార్యాచరణ ద్వారా ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తుందని చెప్పారు. 

తెలంగాణ జీవన విధానంలో ఉన్న విశిష్టతను, ప్రజల భాషలో జానపద శైలిలో పాటల రూపంలో రూపొందిస్తూ ప్రజలకు మంచి జీవన విధానం, అలవాట్ల పట్ల అవగాహనను కలిగిస్తూ, చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉండే కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు అందరూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్​ మామిడి హరికృష్ణ, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు యశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్, జలజ, దేవత సుధాకర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.