నిజామాబాద్: రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన గ్రూప్ 1 వివాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు రియాక్ట్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గ్రూప్ 1 విద్యార్థులను రెచ్చగొట్టాయాని మండిపడ్డారు. రాజకీయాల కోసం విద్యార్థులతో జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం (అక్టోబర్ 21) నుడా ఛైర్మన్‌గా కేశ వేణు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ | రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది: కేటీఆర్
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల అవాస్తవాలను, ఆరోపణలను వాళ్లకు ధీటుగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదును ఉద్యమంగా చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.