ఉప్పునుంతల మండలంలో ఆలయాలను మరింత అభివృద్ధి చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు  

ఉప్పునుంతల, వెలుగు: ఆలయాలను మరింత అభివృద్ధి చేస్తామని,  ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి  ఉగ్ర లక్ష్మి నరసింహుడు అత్యధిక ధనవంతుడని అన్యాక్రాంతమైన ఆయన భూములను కాపాడుతామని  మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని మామిళ్ళపల్లి  లక్ష్మీనరసింహస్వామి పాలకమండలి ప్రమాణ స్వీకారానికి  స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి  ముఖ్య అతిథిగా వచ్చారు.  ఆలయ కమిటీ చైర్మన్​గా  వేముల నరసింహారావు,  సభ్యులుగా స్వరూపరెడ్డి, వేణుగోపాల్ రావు, చెవ్వకృష్ణయ్య, ప్రదీప్ ప్రసాద్,శ్రీనివాస్ గౌడ్, గణేశ్​ గౌడ్  తో కలిసి  ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం  మంత్రి జూపల్లి మాట్లాడారు.

  ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయడానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు.  అనంతరం  ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ  ఈ ఆలయానికి పూర్వ చరిత్ర ఉందని ఆలయ భూములు 49.20 ఎకరాలపైగా అన్యక్రాంతమైనందున వాటిని రక్షించే బాధ్యత చైర్మన్ కు ఉంటుందని వాటిని  పరిరక్షించే దిశగా ముందుకు పోతే పూర్తి సహకారం అందిస్తామన్నారు.  కార్యక్రమంలో మద్దిమడుగు ఆలయ చైర్మన్ రాములు నాయక్, ఉమామహేశ్వర దేవాలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మల్లేశ్​, విజయ డైరీ చైర్మన్ నరసయ్య యాదవ్, ఆలయ ఈవో నరసింహులు, ఆర్డీవో మాధవి పాల్గొన్నారు.