అలంపూరు, వెలుగు: కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడిచిందని, ప్రస్తుతం ప్రజా పాలన నడుస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలంపూర్ లో ముఖ్య కార్యకర్తల మీటింగ్ లో పాల్గొన్నారు. అలంపూర్, ఉండవల్లి మండలాల్లో కార్నర్ మీటింగ్ లు నిర్వహించి మాట్లాడారు.
బీఆర్ఎస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్‌ను లంగా, దొంగ అని మాట్లాడి ఇప్పుడు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. అలంపూర్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి సాగునీరు అందిస్తామన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ లో మూడు రిజర్వాయర్లు నిర్మించి 81వేల ఆయకట్టుకు సాగునీటిని అందించడమే లక్ష్యమన్నారు. అలంపూర్ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు.
మోదీ, కేసీఆర్ కవల పిల్లల వంటి వారని పేర్కొన్నారు. మత చిచ్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోందని, దీనిని తిప్పి కొట్టాలన్నారు. ఆగస్టు 15 తర్వాత రుణమాఫీ చేస్తామని, రాజీనామా చేసి ఇంట్లో కూర్చునేందుకు సిద్ధంగా ఉండాలని హరీశ్‌రావుకు సూచించారు. ఎంపీ క్యాండిడేట్ మల్లు రవి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఆర్ఎస్ ప్రసన్నకుమార్, ఇస్మాయిల్ పాల్గొన్నారు.