
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకుపోయిన కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. టన్నెల్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. లోపల ఎలాంటి శబ్ధం లేదని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరుగుతోన్న సహయక చర్యలను మంత్రి జూపల్లి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రెస్య్కూ బృందాలతో కలిసి ఆయన ప్రమాదానికి గురైన టన్నెల్ లోపలికి స్వయంగా వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. దాదాపు 5 గంటల తర్వాత టన్నెల్ నుంచి మంత్రి జూపల్లి బయటకు వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్ లోపల జరుగుతోన్న రెస్య్కూ ఆపరేషన్ తాజా పరిస్థితిని మీడియాకు వెల్లడించారు.
టన్నెల్ లోపల ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉందని.. 8 మంది కార్మికులు సజీవంగా ఉండే అవకాశం చాలా తక్కువ అని తెలిపారు. నీటి తీవ్రత ధాటికి టన్నెల్ బోరింగ్ మిషన్ కొట్టుకువచ్చిందని చెప్పారు. ప్రమాద స్థలం దగ్గరికి దాదాపు సహయక బృందాలు చేరుకున్నాయని.. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి మరో రెండు మూడు గంటల సమయం పడుతుందన్నారు. 100 మీటర్లలో దూరంలోనే సమస్య ఉందని.. నీరు, బురద ఎక్కువగా ఉందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. రాత్రి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని.. టన్నెల్‌లో 8 మంది కార్మికులను రక్షించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని అన్నారు.
కాగా, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ పనుల్లో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో టన్నెల్ రిటైనింగ్ వాల్ కడుతుండగా 14వ కిలో మీటర్ వద్ద 3 మీటర్ల మేర కుంగిపోయింది. శనివారం (ఫిబ్రవరి 22) ఉదయం సొరంగ మార్గం వద్ద సుమారు మూడు మీటర్ల మేర పై కప్పు కుంగింది. రిటైనింగ్ వాల్ కూలి టన్నెల్‌లో రింగులు విరిగిపడడంతో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. మరో 8 మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుపోయారు. వారికోసం ప్రభుత్వం రెస్య్కూ ఆపరేషన్ చేపట్టింది.