
నిజామాబాద్: బీజేపీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం (ఫిబ్రవరి 17) మంత్రి జూపల్లి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదరిందని.. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదని ఆరోపించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బీసీ కుల గణనను విమర్శించే నైతిక హక్కు బీజేపీ, బీఆర్ఎస్కు లేదని అన్నారు. తెలంగాణకు బీజేపీ వల్ల ఒరిగింది ఏమీ లేదని.. ఆ పార్టీ కేవలం మతాన్ని రెచ్చ గొట్టి రాజకీయ పబ్బం గడుపుతుందని విమర్శించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం గురించిన మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు నిరుద్యోగులను మోసం చేసే పార్టీలని.. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.