బీఆర్‌‌ఎస్‌‌ అప్పుల్లో వాస్తవం లేకపోతే నా పదవికి రాజీనామా చేస్త : శాసన మండలిలో మంత్రి జూపల్లి సవాల్​

బీఆర్‌‌ఎస్‌‌ అప్పుల్లో వాస్తవం లేకపోతే నా పదవికి రాజీనామా చేస్త : శాసన మండలిలో మంత్రి జూపల్లి సవాల్​
  • గత సర్కారు 64 ఏండ్లలో ఎవరూ చేయనంత అప్పు చేసిందని ఫైర్​
  • మంత్రి వ్యాఖ్యలపై కవిత సహా బీఆర్ఎస్​ ఎమ్మెల్సీల అభ్యంతరం

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్ఎస్​పదేండ్ల  కాలంలో రూ.7.11 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఇందులో ఏ మాత్రం అవాస్తవం ఉన్నా తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి కృష్ఙారావు సవాల్​ చేశారు.  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సమస్యలకు పరిష్కారాలను వెదుకుతున్నామన్నారు. 64 ఏండ్లలో రాష్ట్రాన్ని 19 మంది సీఎంలు పాలిస్తే.. రూ.65 వేల కోట్ల అప్పు మాత్రమే అయ్యిందని, కానీ గత ప్రభుత్వ హయాంలో కేవలం పదేండ్ల వ్యవధిలోనే రూ.7.11లక్షల కోట్ల అప్పు అయిందన్నారు.

తాము అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నామని, కావాలంటే బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఇందుకు సంబంధించిన ఆధారాల కాపీలు ఇస్తానని చెప్పారు.  గవర్నర్‌‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం మండలిలో వాడీవేడి చర్చ జరిగింది.  నిధులు, నియామకాలు, ఉపాధి అవకాశాల పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం దృష్టికి పెద్దల సభ తీసుకెళ్లింది. విద్య, వైద్య రంగంతోపాటు అందరికీ సంక్షేమ పథకాలు చేరినప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు భరోసా ఉంటుందని మండలి సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ‘మన ఊరు – మన బడి’ అమలుపై బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించారు.  చాలా ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. చైర్మన్‌‌ కూడా ఈ అంశంపై మాట్లాడారు. తమ ఊరిలో జిల్లా పరిషత్ స్కూల్​ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌‌‌‌ఎస్‌‌ సభ్యులకు సమాధానంగా మంత్రి జూపల్లి కృష్ఙారావు కీలక వ్యాఖ్యలు చేశారు.  అన్ని సమస్యమల పరిష్కారానికి కృషిచేస్తున్నామని చెప్పారు.  గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల వివరాలను వెల్లడించారు.

ఆర్థిక క్రమశిక్షణ లేకనే అప్పులైనయ్​: ఏవీఎన్‌‌ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడతాయని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్‌‌ రెడ్డి అన్నారు.  గత ప్రభుత్వ హయాంలో ఇష్టాను సారంగా ఖర్చు చేశారని చెప్పారు. గొర్రెలు, చేపల పెంపకం లాంటి పథకాలు సరైన ఫలితాలివ్వలేదని అన్నారు. లబ్ధిదారులు గొర్రెలను అమ్ముకున్నారని, దీని వల్ల ఉత్పాదకత లేకుండా పోయిందని పేర్కొన్నారు. గత పాలకులు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని తెలిపారు.

గత సర్కారు హయాంలో ప్రజల కలలు సాకారం కాలే: ఎమ్మెల్సీ కోదండరాం

తెలంగాణ ప్రజలు ఆశించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ అడుగులు పడుతున్నాయని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఉన్నదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల కలలు సాకారం కాలేదని తెలిపారు. నియామకాలకు పదేండ్లపాటు పరిష్కారం దొరకలేదని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే తనను, ప్రొఫెసర్​ హరగోపాల్‌‌ను ఘెరావ్‌‌ చేశారని గుర్తుచేశారు.

 అడుగడుగునా పోలీసుల నిఘా, ఫోన్ల ట్యాపింగ్‌‌ చేశారని అన్నారు. 2018 నుంచి 2022 దాకా ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని తెలిపారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని సభకు తెలిపారు.