- అందుబాటులో ఉన్న భూములపై సర్వేకు ఆదేశం
నల్గొండ: రాష్ట్రంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, బుద్ధవనం పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్దనున్న బుద్ధవనం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా విజయ విహార్, బుద్ధవనం లే- అవుట్లపై వివరాలు ఆరా తీశారు. మొత్తం 270 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం వ్యాపించి ఉందని, వాటి విశేషాలను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్ రెడ్డి, బుద్ధవనం కన్సల్టెంట్ శివనాగిరెడ్డి మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్టార్ హోటళ్ల నిర్మాణం, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, బుద్ధవనానికి ఆసియా ఖండంలోని పలు దేశాల నుంచి బౌద్ధులు ఇక్కడికి వస్తారన్నారు. ప్రత్యేకించి శ్రీలంక, ఇతర ఆసియా ఖండాల నుంచి ఎక్కువ మంది వస్తారని, వారికి అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించాల్సి ఉందన్నారు. ఇందుకోసం నిర్మాణాలు చేపడుతామన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహించి వివరాలు సమర్పించాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌ను ఆదేశించారు.