సోనియాగాంధీ,రాహుల్ గాంధీ , ఖర్గే అగ్రనేతలందరూ మాట ఇచినట్టే కుల గణన చేస్తున్నామని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నారో నిష్పత్తి ప్రకారం వివరాలు నమోదు చేస్తున్నామని తెలిపారు. నవంబర్ 31 లోగా కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు జూపల్లి.
మంత్రిగా ఉన్న తానే మూసీ రివర్ బెల్ట్ లో ఉన్నానని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏసీలో ఉన్న తనకే మూసీ పరిసర ప్రాంతాలు కంపు కొడుతున్నాయని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో దుర్బర జీవితం అనుభవిస్తున్న వాళ్ళు మంచి గాలి ఆస్వాదించవద్దా అని ప్రశ్నించారు.
కేటీఆర్ హరీష్ రావు ప్రతి అంశం పట్ల రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు జూపల్లి. రాజకీయ లబ్దికోసం ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధిపొందుతున్నారని విమర్శించారు. పది నెలల్లో 50 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాం.. బీఆర్ఎస్ హయాంలో కనీసం ఒక్క డీఎస్సీ అయినా వేశారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మూడు నెలల్లో కూలుతుందంటూ బీఆర్ఎస్ విమర్శలు చేసిందన్నారు.
ఆర్టీసీని మూసేసి అడుక్కుతినే స్థాయికి దిగజార్చారంటూ కేసీఆర్ పై మండిపడ్డారు జూపల్లి. తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే అప్పుల కుప్పగా ఎందుకు మారిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీఆర్ఎస్ పార్టీకి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి అంత ఫండ్ ఎక్కడి నుండి వచ్చిందన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి లేనన్ని నిధులు బీఆర్ఎస్ కు అవినీతి అక్రమాల మార్గంలోనే వచ్చాయని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినా బీఆర్ఎస్ కు సిగ్గులేదన్నారు జూపల్లి