బీఆర్ఎస్​ పాలనలో పల్లెలన్నీ నిర్వీర్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

బీఆర్ఎస్​ పాలనలో పల్లెలన్నీ నిర్వీర్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి/పెద్దమందడి, వెలుగు: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్  ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో రూ.18.71 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. మండలంలోని చిలకటోనిపల్లి, అమ్మపల్లి, వీరాయపల్లి, బలిజపల్లి, చిన్నమందడి, పామిరెడ్డిపల్లి తదితర 17 గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పనులు స్పీడ్​గా కంప్లీట్​ చేయాలని ఆదేశించారు. 

పదేళ్ల బీఆర్ఎస్​ పాలనలో గ్రామాలన్నీ నిర్వీర్యమైపోయాయని, గ్రామాల అభివృద్ధి పేరుతో అందినంత దోచుకున్నారే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్  ప్రభుత్వం గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఖిల్లాగణనపురం పీఏసీఎస్​ డైరెక్టర్​ సాయిచరణ్​రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి రూ. 5 కోట్లు

ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యాటకరంగంతో పాటు అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తలకొండపల్లి మండలం వెల్జాల్  గ్రామంలోని వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరిగిన  కల్యాణోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ దైవ చింతనను అలవర్చుకోవాలన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలన్నారు. 

మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. వెల్జాల ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, టాస్క్  సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, పొల్యూషన్  బోర్డ్  మెంబర్  బాలాజీ సింగ్, ఉప్పల వెంకటేశ్, శ్రీనివాస్ యాదవ్  పాల్గొన్నారు.