
- టీబీఎం మిషిన్ ముందు, కింద నాలుగు చొప్పున డెడ్‌బాడీల గుర్తింపు
- ఇయ్యాల నాలుగు మృతదేహాలను బయటకు తెచ్చే అవకాశం
- మిషిన్ కింద ఉన్న వాటిని తీసుకొచ్చేందుకు మరింత టైమ్
- రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రభుత్వ నిర్లక్ష్యమేమీ లేదని మంత్రి వెల్లడి
- బీఆర్ఎస్వి బురద రాజకీయాలని ఫైర్
ఎస్ఎల్‌బీసీ నుంచి వెలుగు టీమ్: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ)కు చెందిన జీపీఆర్ స్కానర్ ద్వారా టీబీఎం మిషిన్‌కు ముందు ఒకచోట నాలుగు డెడ్‌బాడీలను, దాని కింద రెండు చోట్ల మరో నాలుగు మృతదేహాలను గుర్తించినట్టు తెలిపారు.
మిషిన్ ముందు భాగంలోని నాలుగు మృతదేహాలు మూడు ఫీట్ల బురదలో ఉన్నాయి. వాటిని ఆదివారం వెలికితీసే అవకాశం ఉంది. ఈ డెడ్‌బాడీలు ఉన్న ప్రాంతమంతా గట్టిపడింది. అయినప్పటికీ యంత్రాలతో కాకుండా మనుషుల ద్వారానే తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. మిషిన్ కింది భాగంలో ఉన్న మిగిలిన నాలుగు మృతదేహాలను వెలికితీయడానికి టీబీఎంను కట్ చేస్తున్నాం. ఇందుకు మరికొంత సమయం పడ్తుంది. టన్నెల్లోపలి నుంచి బురద, మట్టి, టీబీఎం శకలాలను తొలిగించే ఆపరేషన్నిరంతరాయంగా కొనసాగుతున్నది” అని జూపల్లి వెల్లడించారు.
రెస్క్యూ టీమ్ ధ్రువీకరణ తర్వాత ప్రకటన..
రెస్క్యూ ఆపరేషన్‌పై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి శనివారం రివ్యూ చేశారు. ఇందులో ప్రిన్సిపల్సెక్రటరీ అర్వింద్‌కుమార్, ఎస్పీడీసీఎల్సీఎండీ ముషారఫ్‌అలీ, నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీరికి టన్నెల్లోపలి పరిస్థితులు, రెస్క్యూ ఆపరేషన్తీరును ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్, బీఆర్‌వో, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్లు, ఎన్‌జీఆర్‌ఐ సైంటిస్టులు, టెక్నీషియన్స్ వివరించారు. ఈ సందర్భంగా టన్నెల్లోపల చిక్కుకున్న 8 మంది చనిపోయినట్టు ధ్రవీకరించిన ఆఫీసర్లు, వారి డెడ్‌బాడీలు ఉన్న ప్రాంతాలను మ్యాప్ద్వారా మంత్రులకు వివరించారు. అనంతరం కృష్ణారావు మీడియా సమావేశం పెట్టి, టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది చనిపోయినట్టు ప్రకటించారు.
అత్యాధునిక టెక్నాలజీతో మృతదేహాల గుర్తింపు..
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం గత ఎనిమిది రోజులుగా 12 రెస్క్యూ టీమ్స్ ముమ్మరంగా గాలించాయని మంత్రి జూపల్లి చెప్పారు. ‘‘ఎన్‌జీఆర్ఐ, ఇతర సంస్థల నిపుణులు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఆ 8 మంది చిక్కుకుపోయిన ప్రదేశాలను గుర్తించారు. టీబీఎం మిషిన్ ముందు నాలుగు మృతదేహాలు బురదలో మూడు ఫీట్ల లోతులో ఉన్నాయి. మిగిలిన నాలుగు మృతదేహాలు యంత్రం కింద ఉన్నట్లు తేలింది. మిషిన్ ముందు ఉన్న నాలుగు మృతదేహాలను యంత్రాలతో కాకుండా మనుషులతో వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆదివారం సాయంత్రంలోగా ఆ డెడ్‌బాడీలను బయటకు తెచ్చే అవకాశముంది. మిగిలిన నాలుగు మృతదేహాలు టీబీఎం కింద ఉన్నందున వాటిని తీసేందుకు కొంత టైమ్ పడ్తుంది. 120 మీటర్ల పొడవు,1,500 టన్నుల బరువున్న టీబీఎంను గ్యాస్, ప్లాస్మా కట్టర్లతో తొలగిస్తున్నాం. సొరంగంలో శిథిలాల తొలగింపు, డీవాటరింగ్ పనులు కొనసాగుతున్నాయి’’ అని వెల్లడించారు. విడిభాగాల కటింగ్ తర్వాత లోకో ట్రెయిన్‌తో పాటు కన్వేయర్బెల్టును అందుబాటులోకి తెస్తామన్నారు. టన్నెల్లోపల పరిస్థితులు ఇప్పటికీ క్లిష్టంగా ఉన్నాయని, అయినా వాటిని లెక్కచేయకుండా రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయని కొనియాడారు.
కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం..
ఎస్ఎల్‌బీసీ ప్రారంభించినప్పుడు జీఎస్ఐ సంస్థ 44 కిలోమీటర్లు సర్వే చేసి రిపోర్ట్ఇచ్చిందని, తిరిగి పనులు ప్రారంభించినప్పుడు కూడా సర్వే చేసిందని మంత్రి జూపల్లి తెలిపారు. ‘‘టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. జాతీయ, రాష్ట్ర సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. మా ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. తమ పదేండ్ల పాలనలో 12 కిలోమీటర్లు తవ్వామని చెప్తున్న బీఆర్ఎస్ నేతలు.. మరో 9 కిలోమీటర్లు పని పూర్తి చేసి ఉంటే, ఈ రోజు ప్రమాదం జరిగేదే కాదు. ఇప్పుడేమో ప్రభుత్వంపై బురద జల్లే రాజకీయం చేస్తున్నారు. వారి హయాంలో ప్రమాదాలు జరిగితే ప్రతిపక్ష పార్టీల నేతలను హౌస్ అరెస్టులు చేసి, మీడియాకు బారికేడ్లు పెట్టి అడ్డుకోలేదా?” అని నిలదీశారు. తమ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నేతలు ఘటనా స్థలానికి వచ్చి వాస్తవాలను తెలుసుకునే అవకాశం కల్పించిందన్నారు.
మృతుల వివరాలు..
టన్నెల్‌లో చిక్కుకుని చనిపోయిన 8 మంది వివరాలను ఆఫీసర్లు శనివారం విడుదల చేశారు. వీరిలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇంజనీర్ మనోజ్ కుమార్(50), సీనియర్ ఎఫ్ఈ శ్రీనివాస్ (49), జమ్మూకాశ్మీర్‌కు చెందిన జనరల్ ఆపరేటర్ సన్నీ సింగ్(35), పంజాబ్‌కు చెందిన ఎరెక్టర్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్, జార్ఖండ్‌కు చెందిన లేబర్లు అంజు సాహు (25), సంతోష్ సాహు (36), జగ్తా (37), సందీప్ సాహు (28) ఉన్నారు.
ప్రమాదంపై రాజకీయాలు చేస్తరా?: ఎమ్మెల్యే వంశీకృష్ణ
బీజేపీ, బీఆర్ఎస్నాయకులు ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మండిపడ్డారు. ‘‘రాజకీయాల కోసం ప్రతిపక్షాలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నాయి. అవగాహనతో నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ఊహించని ఘటనతో బాధలో ఉన్న బాధిత కుటుంబాలకు అందరూ అండగా నిలవాలి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో 2020లో జెన్‌కో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కనీసం మీడియాను కూడా అనుమతించలేదు. ఘటనా స్థలానికి వెళ్లేందుకు వచ్చిన నన్ను, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకుని అరెస్టు చేశారు” అని చెప్పారు.