
హైదరాబాద్: పర్యాటక శాఖ టూరిజం పాలసీ లక్ష్యాలను ప్రకటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అసెంబ్లీలో పర్యాటక శాఖ పద్దుపై మాట్లాడిన జూపల్లి.. గత పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం టూరిజం సెక్టర్ ను నిర్లక్ష్యం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధికి పాలసీని తీసుకొచ్చిందన్నారు.
రాబోయే ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ. 15వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దీంతో మూడు లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర ఆదాయంలో టూరిజం వాటా 10శాతం పెంచుతామన్నారు. తెలంగాణలోని జిల్లాల్లో వివిధ ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు స్పెషల్ టూరిజం ఏరియాస్ (STA's) సెక్టార్లుగా గుర్తించామన్నారు.
తమ నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. బోటింగ్, హరిత హోటల్స్, వాటర్ స్పోర్ట్స్, రోప్ వే, వెల్నెస్ సెంటర్లు, ఎకో టూరిజమ్, థీమ్ పార్కులు, సస్పెన్షన్ బ్రిడ్జి, గ్లో గార్డెన్స్, మ్యూజికల్ ఫౌంటెన్స్ 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, సౌండ్ అండ్ లైట్ షో మొదలైన వాటి ఏర్పాటుకు అనుమతులు, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.
పర్యాటక అభివృద్ధి కోసం గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 243కోట్లు కేటాయిస్తే.. మా ప్రభుత్వంలో ఒక్క బడ్జెట్లోనే రూ.738 కోట్లు కేటాయించామన్నారు.
టూరిజం హోటల్స్ ప్రస్తుతం టూరిజం ఆధ్వర్యంలో మొత్తం 43 హోటల్స్, 32 రెస్టారెంట్లు (వే సైడ్ ఎమినిటీస్) కలవు. వీటిలో 23 హోటల్స్, ఒక రెస్టారెంట్ టూరిజం కార్పొరేషన్ నిర్వహిస్తుండగా, 16 హోటల్స్, 17 రెస్టారెంట్లు ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్వహించేందుకు ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. వీటి నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో..
- స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (SASCI) పథకం ద్వారా నల్లమల్ల టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి - రూ. 68 కోట్లు
- రామప్ప టూరిజం సర్క్యూట్ అభివృద్ధి నిమిత్తం - రూ.73 కోట్లు
- ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ (CBDD) స్కీమ్ ద్వారా బుద్ధవనం డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కు రూ.25 కోట్లు,
- నిజాంసాగర్ లో ఎకో టూరిజం అభివృద్ధికి రూ.10 కోట్లు
- బల్కంపేట దేవాలయం అభివృద్ధి నిమిత్తం రూ. 4.20 కోట్లు
- స్వదేశీ దర్శనం పథకం కింద భువనగిరి కోట అభివృద్ధికి రూ. 56 కోట్లు,
- అనంతగిరి ఎకో టూరిజం అభివృద్ధికి రూ.38 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి జూపల్లి అన్నారు.
భవిష్యత్తు ప్రణాళికలు
- మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించటమే లక్ష్యంగా మూసీ పునరుజ్జీవనం
- పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు
- బాపు ఘాట్ వద్ద అభివృద్ధికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రణాళికలు
- లండన్ ఐ తరహాలో జాయింట్ అబ్సర్వేషన్ వీల్ ఏర్పాటు
- ఫ్యూచర్ సిటీ లో గోల్ఫ్ కోర్స్, జాతీయ , అంతర్జాతీయ సమావేశాల నిర్వహణకు 20 వేల మంది సామర్థ్యంతో ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ తరహాలో ఏర్పాటు
- రియో కార్నివాల్ లాంటి ఫెస్టివల్ తరహాలో హైదరాబాద్ కార్నివాల్ ఏర్పాటు