సగర ఫెడరేషన్​ ఏర్పాటు చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు 

సగర ఫెడరేషన్​ ఏర్పాటు చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పేదలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం నాగర్ కర్నూల్  జడ్పీ గ్రౌండ్​లో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో కలిసి సగర శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సగరులను బీసీ–డి నుంచి ఏలోకి మార్చే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

సగర ఫెడరేషన్​ను కార్పొరేషన్ గా మార్చి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జీవో59 సవరణ చేస్తామని, రాష్ట్రంలో 60 లక్షలకు పైగా విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది 18 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను నిరుపేదలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్  మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పేద ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మారుతి, స్రవంతి, నరసింహస్వామి, వనపర్తి లైబ్రరీ చైర్మన్  గోవర్ధన్, కృష్ణమోహన్  పాల్గొన్నారు.

అన్నిరంగాల్లో అభివృద్ధే లక్ష్యం

కోడేరు: గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించి అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం మండలంలోని కొండ్రావుపల్లి, కోడేరు, జనుంపల్లి, సింగాయిపల్లి, రాజాపురం, మైలారం గ్రామాల్లో ఎస్సీ సబ్  ప్లాన్  కింద మంజూరైన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు.

కోడేరు గురుకుల బాలికల పాఠశాల, కేజీబీవీని సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీడీవో శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీపీ రామ్మోహన్ రావు, వేణుగోపాల్ రావు, మహేశ్వర్ రెడ్డి, నక్క వేణుగోపాల్, పోడేండ్ల సురేశ్, పల్లె కురుమూర్తి, జనుంపల్లి నాగేంద్రం ఉన్నారు.