- బాధితురాలిని పరామర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్ టౌన్, వెలుగు : చెంచు మహిళపై జరిగిన దాడి ఆటవిక చర్య అని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూల్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఈశ్వరమ్మను శనివారం మంత్రి పరామర్శించారు. మహిళ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాధిత మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆందోళన చెందొద్దన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారని, ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని ఊపేక్షించేది లేదన్నారు.
బాధితురాలి ముగ్గురు ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. సాయంత్రం -ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్వర్‌రెడ్డి, వంశీ కృష్ణ బాధితురాలిని పరామర్శించారు. బాధిత మహిళకు ప్రభుత్వం తరపున రూ.4 లక్షల ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు.
శాంతిభద్రతల్లో విఫలం : మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి
దాడిలో గాయపడిన ఈశ్వరమ్మను సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి శనివారం పరామర్శించారు. బాధితురాలికిరూ. 1.20 లక్షలు అందజేసి, ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. లేడీ డాక్టర్ లేకుండానే ట్రీట్‌మెంట్ చేయడంపై మండిపడ్డారు. దాడిపై సీఎస్, డీజీపీలతో మాట్లాడతానని చెప్పారు.