మీ అవినీతిపై ఎల్బీ స్టేడియంలో చర్చ పెడ్దాం..హరీశ్​కు మంత్రి జూపల్లి సవాల్

 మీ అవినీతిపై ఎల్బీ స్టేడియంలో చర్చ పెడ్దాం..హరీశ్​కు మంత్రి  జూపల్లి సవాల్
 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు లేదని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. ఆయన సవాలును తానే  స్వీకరిస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై ఎల్బీ స్టేడియంలో చర్చ పెడ్తామన్నారు. శనివారం గాంధీ భవన్​లో  మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాక ముందు రాష్ట్ర ఆదాయమెంత.. అప్పు ఎంత.. అందులో జరిగిన అవినీతి ఎంత.. ఏవరెవరు ఎంత దోచుకున్నారనే దానిపై చర్చ పెడదామా అని హరీశ్​కు జూపల్లి సవాల్ విసిరారు. 

ఎల్బీ స్టేడియంలో మీడియా సమక్షంలోనే  50 వేల మంది ప్రజలు చూసే విధంగా చర్చ పెడదామన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలు, దోపిడీకి సంబంధించిన ఆధారాలన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్​లో లక్షా యాభై వేల కోట్ల దోపిడీ జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను దోచుకుందే  కేసీఆర్,  కేటీఆర్, హరీశ్‌‌‌‌ అని ఫైర్ అయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కావాల్సిందేనని, మురికి కూపం నుంచి పేదలకు విముక్తి కలిపించాల్సిందేనని స్పష్టం చేశారు.  హైదరాబాద్​ను డల్లాస్, లండన్, ఇస్తాంబుల్ చేస్తానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్​లో  కొబ్బరి నీళ్లు తాగేటట్లు చేస్తాన మాట ఎక్కడికి పోయిందని హరీశ్‌‌‌‌ను నిలదీశారు.