ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తాం : జూపల్లి కృష్ణారావు

  • మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు: పేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్  బదావత్  సంతోష్ తో కలిసి పెంట్లవెల్లి తహసీల్దార్  ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేశ్వరం, పెంట్లవెల్లి, జట్రపోలు, గోపులాపురం, కోండూరు, యంగంపల్లి తండా గ్రామాలకు చెందిన 34 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్  చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్  పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. 

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి అదనపు ఆదాయ వనరులు కల్పించడంతో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటడం, విద్యారంగంలో మార్పులు తీసుకురావడం, పేదలకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రిపబ్లిక్​ డే నుంచి అమలు చేసే నాలుగు పథకాలు అర్హులకు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కలెక్టర్  మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్డీవో బన్సీలాల్, తహసీల్దార్  జయంతి, ఎంపీడీవో దేవేందర్ పాల్గొన్నారు.

వీపనగండ్ల: చిన్నంబావి తహసీల్దార్  ఆఫీస్  ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 64 మంది లబ్ధిదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు. రానున్న లోకల్​ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్  అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు.