
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగునీటి సరఫరా, వడ్ల కొనుగోలు, పర్యాటక అభివృద్ధి పనులు, గ్యాస్ సబ్సిడీ తదితర అంశాలపై రివ్యూ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రిజర్వాయర్లలో నీటి నిల్వలకు ఇబ్బంది లేదని, లోపాలు సవరించి వేసవిలో తాగునీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితిలో తాగునీటిని సరఫరా చేసేందుకు సీఎం కలెక్టర్లకు రూ.కోటి చొప్పున మంజూరు చేశారని తెలిపారు.
ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎస్డీఎఫ్ నిధులు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. రైతులు పడిగాపులు పడకుండా కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లులకు పంపించాలని ఆదేశించారు. తేమ, తాలు పేరిట తరుగు తీయవద్దని ఆదేశించారు. మిల్లర్ల నుంచి రూ.150 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, వాటిని రికవరీ చేయాలన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ విజయేందిర బోయి, అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, లైబ్రరీ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ బెక్కరి అనిత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.