- వనపర్తి జిల్లా ఆఫీసర్ల సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఏమిటో ప్రజలకు తెలిసేలా పాలన ఉంటుందని, అధికారులు అందుకు అనుగుణంగా తమ పనితీరు మార్చుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగం జరిగిందని, ఇప్పటి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందన్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, ప్రభుత్వ ఆస్తులు కబ్జా కాకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. తమకు అభూతకల్పన అవసరం లేదని, తమ శాఖలకు సంబంధించిన క్షేత్రస్థాయిలో ఉన్నది ఉన్నట్టుగా నివేదికలు ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వం అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువగా చేసిందని, దీనిని సహించబోమని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రజా సేవకులేనన్న విషయాన్ని మరవొద్దని చెప్పారు. సమస్యలతో వచ్చే ప్రజలను అధికారులు విసుక్కోవద్దని సూచించారు.
రాబోయే వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళికలతో మారుమూల గ్రామాలకు నీరందించాలని ఆదేశించారు. అధికారులు ఇస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన ఉండడం లేదని, చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. వీటి నిర్వహణ ఏజెన్సీకి బిల్లులు ఇచ్చేముందు పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులతో పాటు గ్రామ మహిళా సంఘాల అధ్యక్షుల సంతకాలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులతో మరో పది రోజుల్లో మరోసారి రివ్యూ నిర్వహిస్తానని తెలిపారు.
జిల్లాలో కబ్జా అయిన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. మైన్స్ కు సంబంధించిన ఖనిజాలు ఎక్కడ వినియోగించారు. వచ్చిన ఆదాయం ఎంత? అనే విషయంపై పూర్తి నివేదికను తయారు చేసి ఇవ్వాలని కోరారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అడిషనల్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎస్ తిరుపతి రావు, అడిషనల్ ఎస్పీ తేజావత్ రాందాస్, ఆర్డీవో పద్మావతి పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం
కొల్లాపూర్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మండలంలోని రామాపురం గుట్టపై వెలసిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామపూర్ గ్రామంలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ఆర్థికసాయం అందించారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. మాజీ సర్పంచ్ బచ్చలకూర బాలరాజు, రాజు, రాము, వెంకటస్వామి,చంద్రయ్య పాల్గొన్నారు.