తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకు చెడ్డపేరు వస్తుందని, కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో అబ్కారీ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఇటీవల ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సొంత నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీని వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. మద్యం కంపనీల అనుమతుల వ్యవహరంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా బేవరేజ్ కార్పొరేష న్ అధికారులు ఎలా విధివిధానాలు ఖరారు చేస్తారని మండిపడ్డారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషన ర్ & ఎండీ శ్రీధర్, బేవరీస్ కార్పొరేష న్ జనరల్ మేనేజర్ అబ్రహంను మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం సరఫరా, కల్తీ కల్లు, గుడుంబా, గంజాయి తదితర తయారీ, సరఫరా, అమ్మకాలపై నిరంతర నిఘాను పెట్టాలని, ఉక్కుపాదంతో డ్రగ్ మాఫియాను అణిచివేయాలనే కృతనిశ్చయంతో CM రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, దీనిపై CM రేవంత్ రెడ్డి ఇప్ప టికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తయారీదారులు, సరఫరాదారులు, విక్రేతలు, సప్లయర్ నెట్ వర్క్ జాబితా తయారు చేసి డాటా బేస్ తయారు చేయాలని దిశానిర్ధేశం చేశారు.