అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : జూపల్లి కృష్ణారావు

నిజామాబాద్/ కామారెడ్డి​,  వెలుగు : జిల్లాలో అక్రమ మైనింగ్​ను   ఉపేక్షించబోమని  రాష్ర్ట ఎక్సైజ్​, పర్యాటక శాఖల మంత్రి, ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.   మాచారెడ్డి మండలం మంథని దేవునిపల్లి శివారులో కొనసాగున్న మైనింగ్​, బ్లాస్టింగ్​పై తక్షణమే ఎంక్వైరీ చేసి వారం రోజుల్లో తనకు రిపోర్టు ఇవ్వాలని మంత్రి  ఆదేశించారు.   మంగళవారం నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో  ప్రజా పాలన పై ఉమ్మడి జిల్లా ఆఫీసర్లతో  మంత్రి రివ్యూ చేశారు.  ఈ మీటింగ్​లో అక్రమ మైనింగ్​ వ్యవహారంపై మంత్రి ప్రస్తావించారు.  

తాను నిజామాబాద్​కు వస్తుంటే  కామారెడ్డిలో కొందరు బాధితులు కలిసి    మైనింగ్​పై   ఫిర్యాదు చేశారని మంత్రి పేర్కొన్నారు.  బ్లాస్టింగ్​తో బోర్లు, ఇండ్లు దెబ్బతింటున్నాయని బాధితులు చెప్పారన్నారు.  ఎంక్వైరీ రిపోర్టు తనకు అందజేయటంతో పాటు,  అక్రమ మైనింగ్​ ద్వారా నష్టపోయిన బాధితులకు  యజమాన్యం ద్వారా నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకొవాలని మంత్రి  పేర్కొన్నారు. 

ప్రజాపాలన విజయవంతం చేయాలి 

సమిష్టి బాధ్యతతో ప్రజాపాలన ను విజయవంతం చేయాలని   మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. పోరాడి సాధించిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత గవర్నమెంట్​తీసుకుందన్నారు.    కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటామన్నారు. ప్రతి దరఖాస్తు ను ఆన్​లైన్​ చేయాలన్నారు.  జవాబుదారీ, పూ‌‌‌‌ర్తి పారదర్శకతతో ఆఫీసర్లు పనిచేయాలన్నారు.  

ఈ కార్యక్రమంలో ఎంపీలు ​సురేశ్​​రెడ్డి,  అర్వింద్​, జడ్పీ చైర్మన్​ విఠల్​రావు, మేయర్​ నీతూకిరణ్​, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పి.సుదర్శన్​రెడ్డి, ఆర్​.భూపతిరెడ్డి, పైడిరాకేశ్​​రెడ్డి, ధన్​పాల్​ సూర్యనారాయణ, వెంకటరమణారెడ్డి , కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ, నిజామాబాద్​ అడిషనల్​ కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, మనుచౌదరి, నగర పాలక కమిషనర్​ మంద మకరంద్​ తదితరులు పాల్గొన్నారు.