హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు నలువైపులా అన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో గ్లోబల్ సిటీగా మార్చేందుకు అంకితభావంతో పని చేస్తున్నామని తెలిపారు. ఆదివారం హైటెక్స్ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రాపర్టీ షోలో మంత్రి జూపల్లి పాల్గొని, మాట్లాడారు.
"మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ పర్యాటకంగా మరింత వృద్ది చెందుతుంది. ముచ్చర్లలో ఫోర్త్ సిటీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ , స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ , ఎలివేటేడ్ కారిడార్ ఏర్పాటుతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన ప్రగతి సాధించబోతోంది. రియల్ ఎస్టేట్ రంగానికి గతంలో కంటే మంచి రోజులు రాబోతున్నాయి. బిల్డర్లు, రియల్టర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ జోలికి హైడ్రా వెళ్లదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. గతంలో పొందిన నిర్మాణ అనుమతులు, ఎన్వోసీలు రద్దు చేయబోం" అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్, నరెడ్కో వైస్ ప్రెసిడెంట్ కిరణ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్ దామెర, సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి, ట్రెజరర్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.