- ప్రజాపాలనలో డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటం
- ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని కామెంట్
కొల్లాపూర్, వెలుగు : ప్రజా పాలనలో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. శనివారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఆరో వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని పేర్కొన్నారు. వచ్చే నెల 15వ తేదీకల్లా అందరి ఇళ్లలో గ్యాస్ సిలిండర్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కొత్త కనెక్షన్లు, కనెక్షన్ పేరు మార్పిడి జరిగిపోవాలని అధికారులకు సూచించారు.
కొల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, ఓడిపోయిన వారు పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి అందరి ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో లేవో చూడాలన్నారు. చనిపోయిన వారి పేరిట ఉన్న కనెక్షన్ మార్పిడి చేయకుండా డబ్బులు తీసుకుని కొత్త కనెక్షన్ ఇస్తున్నారన్న ఫిర్యాదులపై మంత్రి సీరియస్ అయ్యారు. ఈ విషయంపై సివిల్ సప్లై ఆఫీసర్లు, గ్యాస్ ఏజెన్సీలను ఆయన హెచ్చరించారు. ప్రజల ఇండ్లలో గ్యాస్ సిలిండర్ లేకపోతే కౌన్సిలర్ టికెట్లు రావని కాంగ్రెస్ నేతలకు ఆయన స్పష్టం చేశారు.
ఓ మహిళ తనకు గ్యాస్ సిలిండర్ లేదని, సిలిండర్ కోసం వెళ్తే జనరల్ కనెక్షన్ అని చెప్పి రూ.4,600 తీసుకున్నారని మంత్రి దృష్టికి తెచ్చింది. దీంతో భారత్ గ్యాస్ హెడ్ ఆఫీస్కు మంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. కనెక్షన్ కు రూ.2,600 మాత్రమే తీసుకోవాలని చెప్పారు. ప్రజలతో మాట్లాడి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గ్యాస్ సిలిండర్ కనెక్షన్, భూపట్టా మార్పిడి కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు మంత్రికి చెప్పగా.. తహసీసిల్దార్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల దరఖాస్తులను తీసుకోవాలన్నారు.
పెద్దకొత్తపల్లి మండలం కాల్వకోల్, దేవుని తిరుమలపురం గ్రామాల్లో పర్యటించి సంబంధిత అభయహస్తం పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అప్లికేషన్లను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తన భూమి విరాసత్ కోసం రెవెన్యూ అధికారుల దగ్గరికి పోతే లంచం డిమాండ్ చేశారని, వారు అడిగిన మేరకు కొన్ని డబ్బులు కూడా ఇచ్చానని ఓ మహిళ మంత్రి దృష్టికి తెచ్చారు.
లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఆధారాలు ఇస్తే విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అనంతరం ఎస్వీఎస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జూపల్లి ప్రారంభించారు. ఆర్డీఓ నాగరాజు, తహసీల్దార్ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ రాజ య్య తదితరులు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు.