కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే..ఫారెస్ట్ ల్యాండ్ ఏ మాత్రం కాదు: జూపల్లి

కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే..ఫారెస్ట్ ల్యాండ్ ఏ మాత్రం కాదు: జూపల్లి
  • చెట్లు పెరిగినంత మాత్రాన అడవి అయిపోతుందా?
  • బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఫైర్

హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే అని, అటవీ భూములు ఏమాత్రం కావని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. భూముల్లో చెట్లు పెరిగినంత మాత్రాన అది అడవి అయిపోతుందా? అని ప్రశ్నించారు. 20 ఏండ్లుగా పడావుగా ఉండటంతో చెట్లు పెరగడం సహజం అన్నారు. అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని, వాటిని ఇబ్బందిపెడ్తున్నామని బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు.

గాంధీభవన్​లో బుధవారం ఆయన మీడియాతో చిట్​చాట్ చేశారు. ‘‘2004లో 400 ఎకరాల ఐఎంజీ సంస్థకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. భూ బదలాయింపు కింద గోపన్ పల్లిలోని 396 ఎకరాల భూమి హెచ్‌‌‌‌సీయూకు అప్పగించింది. వాస్తవాలు పట్టించుకోకుండా అబద్ధాలు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. పదేండ్ల పాటు దీనిపై నోరు మెదపని బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు స్టూడెంట్లను రెచ్చగొడ్తున్నది. ప్రైవేట్ కంపెనీకి ఆ భూమి దక్కకుండా కాపాడిందే కాంగ్రెస్ ప్రభుత్వం’’అని జూపల్లి అన్నారు.

కేబినెట్ విస్తరణలో శాఖల మార్పు

కేబినెట్ విస్తరణ అంటేనే శాఖల మార్పు అని మంత్రి జూపల్లి అన్నారు. మంత్రివర్గ విస్తరణలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి మరో అవకాశం ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. సీఎం తమ జిల్లా నుంచే ఉన్నా.. ఆయన ఫోకస్ అంతా రాష్ట్రంపై ఉంటుందన్నారు. మంత్రులకు అధికారులు వినడం లేదనే విషయంపై స్పందిస్తూ.. ‘‘అధికారులకు భయం లేదంటే భక్తి.. రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి.

పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అహంకారంగా వ్యవహరించారు. మంత్రులు కూడా అవమానానికి గురయ్యారు. అన్నీ నాకే తెలుసు అనే మైకంలో కేసీఆర్ పాలన సాగింది. 80 వేల పుస్తకాలు చదివిన అని చెప్పుకునే మేధావి.. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి చేసిందేమీ లేదు. కేసీఆర్ మంత్రివర్గంలో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసిన. సీఎస్‌‌‌‌ఆర్ నిధులను విద్యాభివృద్ధి కోసం ఖర్చు చేయాలని కలెక్టర్ల సమావేశంలో ఎన్నోసార్లు చెప్పిన’’అని జూపల్లి గుర్తు చేశారు.