
- గత బీఆర్ఎస్ హయాంలో టూరిజం పాలసీ కూడా తేలేదు
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు అధికారంలో ఉన్నా టూరిజం పాలసీ కూడా తీసుకురాకుండా పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తాము తెలంగాణ టూరిజాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో పర్యాటక శాఖ పద్దుపై మంత్రి మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం మేరకు రాష్ట్రంలో నూతన టూరిజం పాలసీని తెచ్చామన్నారు. వచ్చే ఐదేండ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని.. 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని టార్గెట్ గా పెట్టుకున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడంలో తెలంగాణను దేశంలోనే టాప్ 5లో నిలుపుతామన్నారు.
రాష్ట్రంలో స్పెషల్ టూరిజం ఏరియాస్(ఎస్ టీఏ)ను 27 సెక్టార్లుగా గుర్తించామన్నారు. బోటింగ్, హరిత హోటల్స్, వాటర్ స్పోర్ట్స్, రోప్ వేస్, వెల్నెస్ సెంటర్లు, ఎకో టూరిజమ్, థీమ్ పార్కులు, సస్పెన్షన్ బ్రిడ్జిలు, గ్లో గార్డెన్స్, మ్యూజికల్ ఫౌంటెయిన్స్, త్రీడి ప్రొజెక్షన్ మ్యాపింగ్, సౌండ్ అండ్ లైట్ షో వంటి వాటి కోసం అనుమతుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
గత పదేండ్లలో బడ్జెట్లో టూరిజానికి రూ. 2 వేల కోట్లు మంజూరు కాగా, రూ. 243 కోట్లు ఖర్చు చేశారని.. అందులో ఒక సిద్దిపేటలోనే రూ. 51 కోట్లు వ్యయం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.738 కోట్లు కేటాయించిందని తెలిపారు. నల్లమల, రామప్ప టూరిజం సర్క్యూట్ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించామని తెలిపారు. పీపీపీ విధానంలో మెగా రిటైల్ మాల్స్ వంటివి తెస్తున్నామన్నారు.
‘మిస్ వరల్డ్’ ఖర్చు స్పాన్సర్లదే..
మిస్ వరల్డ్ 2025 పోటీలను అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రపంచ టూరిస్టులను ఆకర్షించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మిస్ వరల్డ్ కు రూ.54 కోట్ల ఖర్చు కానుండగా.. ఇందులో సగం ఖర్చును నిర్వాహకులే భరిస్తారని మంత్రి వెల్లడించారు. మిగతా రూ. 27 కోట్లను టూరిజం కార్పొరేషన్ స్పాన్సర్ల ద్వారా సేకరిస్తోందని తెలిపారు.
కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం పెంచినం
తమ ప్రభుత్వం తీసుకున్న సమర్థవంతమైన చర్యలతో కమర్షియల్ట్యాక్స్ఆదాయాన్ని గణనీయంగా పెంచామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘కమర్షియల్ట్యాక్స్ఆదాయం 2023–24లో 0.1శాతం ఉండగా, 2024–25 నాటికి 7.7 శాతానికి పెరిగింది.
వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తే ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. మేం అధికారంలోకి వచ్చినంక ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచాలని ఆలోచన చేయలేదు. 2024–25లో ఎక్సైజ్ ఆదాయం రూ. 34 వేల కోట్లు రావాలి. లైసెన్స్‌ల ద్వారా రూ.2వేల కోట్ల ఆదాయం వచ్చింది” అని తెలిపారు.