కొల్లాపూర్, వెలుగు : సర్కారు బడుల్లో కార్పొరేట్ విద్యను అందించేలా తీర్చిదిద్దుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం కొల్లాపూర్ మండలం సింగోటం, పెంట్లవెల్లి మండలం కొండూర్ జడ్పీ హైస్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొండూరు, సింగోటం స్కూళ్లలో సౌలతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సామాన్యులు తమ సంపాదన అంతా పిల్లల చదువుల ఖర్చు చేస్తున్నారని, కార్పొరేట్ స్థాయిలో సర్కారు బడుల్లో సౌలతులు ఉంటే ఇక్కడే చదివించే అవకాశం ఉంటుందన్నారు. తన నిధులన్నీ స్కూల్స్ డెవలప్మెంట్ కోసమే ఖర్చు పెడతానని తెలిపారు. గురుకులాల్లో సీట్ల మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ఎగబడేలా తీర్చిదిద్దుతానని చెప్పారు. స్కూళ్ల డెవలప్మెంట్లో అందరినీ భాగస్వాములను చేస్తామని, స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైల సహకారం తీసుకుంటామని తెలిపారు.
అనంతరం గ్రామ సమీపంలోని వాగు దాటి సంపత్ రావు పల్లి, సింగవరం వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని, వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ కొండూరు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ ధర్మతేజ, గోపాల్, ఎల్లాగౌడ్, కురుమయ్య పాల్గొన్నారు.
చిన్నం బావి: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ గవర్నమెంట్ స్కూల్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన సొంత ఊరైన పెద్ద దగడ గ్రామంతో పాటు తాను చదువుకున్న పెద్దమార్ స్కూల్‌ను మొదటి ప్రాధాన్యతగా అభివృద్ధి చేస్తానన్నారు. స్కూల్‌కు ఉదయం ఏడు గంటలకే విద్యార్థులు వచ్చి చదువుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రతి స్కూల్‌ను రెసిడెన్షియల్ స్కూల్ గా తయారు చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఎంపీటీసీ పుష్పవతి, మాజీ జడ్పీటీసీ కృష్ణ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్ పాల్గొన్నారు.