నాగర్కర్నూల్, వెలుగు : ప్రజల ఆకాంక్షల మేరకు పాదర్శకంగా, అవినీతికి తావులేని పాలన అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, గోరటి వెంకన్న, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, డా. వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శాంత కుమారి, కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్లతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మిషన్ భగీరథ, ఇరిగేషన్, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, రోడ్లు భవనాలు, విద్యుత్, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖలపై రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుతో అభివృద్ధిలో నాగర్ కర్నూల్ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు.వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. గత ప్రభుత్వం రూ. 41 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపట్టినా సరైన ప్రణాళిక, పర్యవేక్షణ లేక నీళ్లు అందడం లేదన్నారు. తమ నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా.వంశీకృష్ణ సమావేశంలో పేర్కొనగా, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారం రోజుల్లో అన్ని గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని, దీనికి కలెక్టర్ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. నీళ్లు వస్తున్నట్లు మహిళలు సంతకం చేస్తేనే బిల్లులు చెల్లించాలన్నారు. అనంతరం పీఆర్ఎల్ఐ, కల్వకుర్తి లిఫ్ట్లపై రివ్యూ చేశారు. ఖర్చు చేసిన నిధులు, మిగిలిన పనుల వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వడ్లు తీసుకొని సీఎంఆర్ ఇవ్వని మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ పెట్టాలని ఆదేశించారు. ఈ నెల 31 లోగా గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలకు కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
త్వరలోనే శాఖల వారీగా రివ్యూ చేస్తామని, పూర్తి నివేదికలు వారం రోజుల ముందు తనతో పాటు ఎమ్మెల్యేలకు అందజేయాలని అదేశించారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. ఇప్పటివరకు చేపట్టిన పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమాలు అనేలా ప్రవర్తించారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలు తమకు స్వేచ్ఛ వచ్చినట్లు సంబరపడ్డారని తెలిపారు. మొదటిసారి జిల్లా కేంద్రానికి వచ్చిన జూపల్లికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అడిషనల్ కలెక్టర్లు కుమార్ దీపక్, సీతా రామారావు, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.