పర్యాటక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

పర్యాటక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు
  • పీపీపీ పద్ధతిలో ప్రాంతాలు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయండి
  • అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం సచివాలయంలో 2025-– 26 సంవత్సరానికి సంబంధించి ప్రొహిబిషన్‌‌ అండ్‌‌ ఎక్సైజ్‌‌, టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ శాఖలకు సంబంధించి ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నూతన టూరిజం పాలసీని తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనకు అనుగుణంగానే బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి టూరిజం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి కావాల్సిన వనరులు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తీసుకురావడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 

పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖకు అత్యంత విలువైన ప్రాంతాలను రాష్ట్రప్రభుత్వం కేటాయిస్తున్నదని చెప్పారు. వాటిని నిర్దేశిత కాలంలో అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకువస్తే  రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) పద్ధతిలో టూరిజం ప్రాజెక్టులను చేపట్టడానికి రాష్ట్రంలో చాలా మంది ఆసక్తిగా ఉన్నారని వివరించారు. పీపీపీ పద్ధతిలో చేపట్టే పర్యాటక ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.  హైదరాబాద్ సిటీ చుట్టూ అటవీ శాఖ 59 బ్లాక్ లను గుర్తించి అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, టూరిజం శాఖ కూడా  కొత్త ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడానికి కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమర్షియల్ టాక్స్ కమిషనర్ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, టూరిజం డైరెక్టర్ హనుమంతు జెండగే తదితరులు పాల్గొన్నారు.  

మేడారం జాతర, పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి

మేడారం జాతర, గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ సూచించారు. మంగళవారం సెక్రటేరియెట్‌‌లో ప్రీ బడ్జెట్ సమావేశంలో భాగంగా దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ఆరు ప్రధాన దేవాలయాల అభివృద్ధికి పాస్టర్ ప్లాన్‌‌ రూపకల్పనపై మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వందల కోట్లతో చేపడుతున్న పనులు భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలంటే ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. 

రాష్ట్రంలో ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అలాగే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 59 అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలని చెప్పారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాలు, అర్బన్ పార్కులను అభివృద్ధి చేయడం వల్ల ఆయా శాఖలకు ఆదాయం కూడా సమకూరుతుందన్నారు. పురాతన దేవాలయాలను పునరుద్ధరించే పనులను ఆర్కియాలజీ డిపార్ట్‌‌మెంట్‌‌ చేపట్టాలని భట్టి సూచించారు. 

గిరిజనులకు పోడు పట్టాలిచ్చాం..

గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చామని, ఆ భూముల్లో వారు సాగు చేసుకుంటున్నారని భట్టి తెలిపారు. అయితే, అటవీ శాఖతో సమన్వయం లేకపోవడంతో పోడు భూముల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. గిరిజన రైతుల ఇబ్బందుల పరిష్కారానికి, అటవీ విస్తీర్ణం పెంచడం, సోలార్ విద్యుత్ ద్వారా గిరిజన రైతులు పంపుసెట్ల వినియోగంపై చర్చించేందుకు త్వరలో అటవీ, గిరిజన, ఉద్యాన, వ్యవసాయ, ఇంధన శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 

ఉపాధి హామీ పథకం ద్వారా చెక్ డ్యాంలు, ఇతర పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే, వన మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఇందులో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్ తదితరులు పాల్గొన్నారు.