వనపర్తి/ మదనాపురం, వెలుగు: బీమా లిఫ్ట్ కింద రైతులు సాగు చేసిన పంటలకు చివరి తడికి నీరు అందిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో పంటలు ఎండనివ్వమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి జిల్లాలోని రామన్ పాడు, రంగసముద్రం రిజర్వాయర్లను పరిశీలించారు. వనపర్తి. కొల్లాపూర్ నియోజకవర్గాల్లో రైతులు వేసుకున్న మెట్ట పంటలు చివరి దశలో ఉన్నావని.
వీటికి ఒక తడి అందిస్తే రైతుల నష్టపోకుండా ఉంటారన్నారు. జూరాల ప్రాజెక్టుతో పాటు వివిధ రిజర్వాయర్లలో నీరు అడుగంటడంతో కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మదనాపురం మండలం నెలివిడి, నర్సింగాపురం ఎత్తిపోతల పథకం పని చేయడం లేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఇరిగేషన్ ఎస్ఈని వివరాలు అడగగా, పైప్ లైన్, పంపు సెట్లలో లోపాలున్నాయని వీటిని సరి చేసేందుకు రూ. 70 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. నెలివిడి, నర్సింగాపురం, కొన్నూర్, ద్వారక నగరం గ్రామాల చెరువులు నింపి వేసవిలో రైతుల ఇబ్బందులు తీర్చాలని ఆదేశించారు. కాంగ్రెస్ కిసాన్ జిల్లా నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి, పాపయ్యగారి కృష్ణారెడ్డి, నాగన్న, వడ్డే కృష్ణ. మహదేవన్ గౌడ్. రవికుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ శ్రీరంగంగా తీర్చిదిద్దుతాం
శ్రీరంగాపూర్: శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయాన్ని అన్నిరకాలుగా డెవలప్ చేసి తెలంగాణ శ్రీరంగంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ఆలయాభివృద్ధికి ఫండ్స్ మంజూరు చేయిస్తానని చెప్పారు. అనంతరం ఆయన రంగనాథ రిజర్వాయర్ 16వ డిస్ట్రిబ్యూటరీనిపరిశీలించి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామన్నారు. జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, రాములు యాదవ్, శ్రీహరిరాజు, భీరం రాజశేఖర్, గోవింద్, గంగాదర్, ఆశన్న పాల్గొన్నారు.