సేవాలాల్​ చూపిన మార్గం ఆచరణీయం :  మంత్రి జూపల్లి కృష్ణారావు

సేవాలాల్​ చూపిన మార్గం ఆచరణీయం :  మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు: బంజారాల ఆరాధ్య దైవం సంత్  సేవాలాల్  మహారాజ్  చూపిన మార్గం ఆచరణీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని  సేవాలాల్  భవన్ లో సేవాలాల్​ జయంతిని నిర్వహించారు.  నియోజకవర్గం పరిధిలోని లంబాడా మహిళలు పాల్గొని నృత్యాలతో అలరించారు.

పట్టణంలోని మాధవ స్వామి ఆలయం నుంచి నిర్వహించిన బైక్  ర్యాలీలో కలెక్టర్  బదావత్  సంతోష్  పాల్గొన్నారు. మహాభోగ్  కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్  పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. డీటీడబ్ల్యూవో ఫిరంగి, ఆర్డీవో బన్సీలాల్  పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు..

వీపనగండ్ల: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వీపనగండ్ల సీహెచ్ సీకి మంజూరైన 108ను ప్రారంభించారు. రూ.25 లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్  ప్లాన్  నిధులతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, రూ.15 లక్షలతో కేజీబీవీలో చేపడుతున్న మెయింటెనెన్స్  పనులకు భూమిపూజ చేశారు.

ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది వివరాలను డాక్టర్​ ప్రియాంకను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, డాక్టర్లు వంశీకృష్ణ, రాజశేఖర్, 108 కో ఆర్డినేటర్  రవికుమార్, గోదల బీరయ్య, వెంకటేష్, గంగిరెడ్డి ఉన్నారు.

గంజాయి సాగు, నాటు సారా తయారీపై ఉక్కు పాదం..

నాగర్ కర్నూల్ టౌన్: జిల్లాను గంజాయి, నాటు సారా రహిత జిల్లాగా మార్చేందుకు ఎక్సైజ్, పోలీస్  శాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో కలెక్టర్  బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్  వైభవ్  రఘునాథ్, ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయికి బానిసలై యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో గంజాయి సాగు, నాటు సారా తయారీ లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం పాల్గొన్నారు.