
- రాజకీయ ప్రయోజనాల కోసమే ఎస్ఎల్బీసీపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలు: మంత్రి జూపల్లి
- కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను గత సర్కారు నిర్లక్యం చేసిందని ఫైర్
హైదరాబాద్, వెలుగు : మాజీ మంత్రి హరీశ్‌రావుతో సహా బీఆర్ఎస్ నేతలు ప్రకృతి విపత్తులను సైతం రాజకీయంగా వాడుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. వారందరూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, ఎస్ఎల్బీసీపై నిస్సిగ్గుగా దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.
శుక్రవారం గాంధీభవన్‌లో జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారని, మంత్రులందరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు.
సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ టీంతో శతవిధాల ప్రయత్నించామని చెప్పారు. నిపుణుల బృందం సలహాలు, సూచనల మేరకే సహాయక చర్యలపై ముందుకు సాగుతున్నామని తెలిపారు. 8 మంది ప్రాణాలతో ముడిపడ్డ సంఘటనపై.. బీఆర్ఎస్ నేతలు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాళ్లలా శవ రాజకీయాలు చేయలే..
గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ టన్నెల్ లో ఏడుగురు చనిపోతే తాము వాళ్లలాగా శవరాజకీయాలు చేయలేదని బీఆర్ఎస్ నేతలపై మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు. నాడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లారా? అని ప్రశ్నించారు. కొండగట్టు బస్సు ప్రమాదం, పాలమూరు –రంగారెడ్డి ప్రమాదం, శ్రీశైలం పవర్ హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు అప్పట్లో సీఎం, మంత్రులు సంఘటనా స్థలానికి వెళ్లడం కానీ, బాధితులను పరామర్శించిన దాఖలాలుగానీ లేవని అన్నారు.
శ్రీశైలం పవర్ హౌస్‌లో ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారని, కానీ, తమ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను అడ్డుకోలేదని చెప్పారు. కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు విషయంలో రాద్ధాంతం చేయడం తగదని హితవు పలికారు. నల్గొండ ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి తీరుతామని చెప్పారు. సమావేశంలో మెట్టు సాయి కుమార్, అల్లం భాస్కర్, జి.భాస్కర్ పాల్గొన్నారు.