మరోసారి బీఆర్ఎస్ పై మండిపడ్డారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ ఓటమే తన లక్ష్యంగా పనిచేస్తానన్నారు. నాగర్ కర్నూల్ కొల్లాపూర్ లో జూపల్లి తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇపుడే తన ఆట మొదలయిందన్న జూపల్లి.. తెలంగాణనే మైదానమని.. గోల్ ప్రగతి భవన్ లో పడ్తదని వ్యాఖ్యానించారు. త్వరలో మహబూబ్ నగర్ లోని ప్రతి నియోజకవర్గాకి వస్తానని.. 14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. లూఠీ చేసిన ప్రజా ధనాన్ని హుజురాబాద్ లో పంచినట్లు తనను ఓడించడానికి కొల్లాపూర్ లో అందరికి దళితబంధు, ఇండ్లు ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడామని.. రాష్ట్రం వచ్చాక మళ్లీ పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. త్వరలో ఆధారాలతో సహా అందరి బండారం బయపడ్తదన్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జూపల్లి కృష్ణారావుతో పాటుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే బాగుండేదన్నారు జూపల్లి. మీ బండారం బయట పెడతానని, తనకు భయపడి సస్పెండ్ చేశారన్నారు . గత రెండు, మూడేళ్లుగా పార్టీ సభ్యత్వం చేసే బుక్ కూడా ఇవ్వలేదన్న జూపల్లి.. తనకు బీఆర్ఎస్ లోనే ఉన్నానా లేదా అనే అనుమానం ఉండేదన్నారు.