కేసీఆర్ మళ్లీ సీఎం అయితే.. తెలంగాణను అమ్మేసే పరిస్థితి వచ్చేది: మంత్రి జూపల్లి

కేసీఆర్ మళ్లీ సీఎం అయితే.. తెలంగాణను అమ్మేసే పరిస్థితి వచ్చేది: మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వందిమాగధులు ప్రచారం చేస్తున్నారని.. ఆయన ఎందుకు మళ్లీ సీఎం కావాలో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం, గొప్ప పరిపాలన కోసం ఉద్యమకారులు ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఉంటే.. తెలంగాణను అమ్మేసే పరిస్థితి వచ్చేదని ఆరోపించారు.

మంగళవారం సీఎల్పీలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వంశీ కృష్ణతో కలిసి జూపల్లి మీడియాతో మాట్లాడారు. నెలకు రూ.6,500 కోట్లు వడ్డీ కట్టేలా కేసీఆర్ పదేండ్ల పాటు పరిపాలించారని విమర్శించారు. 65 ఏండ్లలో18 మంది ముఖ్యమంత్రులు 65 వేల కోట్ల అప్పు చేస్తే.. కేసీఆర్ పదేండ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు కేసీఆర్ దోచిపెట్టాడని మండిపడ్డారు.

మామ, అల్లుడు టెండర్లను పంచుకున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేయడం వల్లనే తమ ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేయడంలో ఆలస్యం అవుతోందని అన్నారు. అనేక తప్పులు చేసి, తాను అమాయకుడినని కేటీఆర్​ చెబుతుంటే నవ్వాలో.. ఏడవాలో..అర్థం కావడం లేదన్నారు కేటీఆర్ మాటలు వినడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ ఎందుకు ఆమనగల్లులో ధర్నా చేశారో తెలియదని అన్నారు. చెప్పుడు మాటలు విని కేటీఆర్ అనవసరంగా రేవంత్ రెడ్డిపైన ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే వాటిని నిరూపించాలని సవాల్ చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ మాట్లాడుతూ..రాయలసీమకు వెళ్లి చేపల పులుసు తిని బేసిన్లు లేవు, బేషజాలు లేవని కేసీఆర్ అన్నాడని, ఆంధ్రా నీళ్ల దోపిడీకి కేసీఆర్ వైఖరే ప్రధాన కారణమని అన్నారు.