- ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఆఫీసర్ల అవగాహన
నాగర్ కర్నూల్, వెలుగు: తెలంగాణ యువత విద్య, నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు దీటుగా స్వయం ఉపాధి పొందే లక్ష్యంతో ముందుకెళ్లాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మీడియం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ కల్పన, ఆర్థిక స్థిరత్వంపై అవగాహన కల్పించేందుకు మంగళవారం నాగర్కర్నూల్లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సుకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం విద్య ఒక్కటే సరిపోదని జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలిగే నైపుణ్యం సాధించినపుడే యువతకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. వంద మందిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటే, ప్రైవేట్ రంగంలో 99 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, యువతకు ఉద్యోగ కల్పనపై అవగాహన కల్పించేందుకు రూ.50 లక్షలతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనప్పటికీ, 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతూనే ప్రైవేట్ పరిశ్రమలను నెలకొల్పుతూ మరో పది మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా తయారు కావాలని సూచించారు.
ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో దేశంలోని వివిధ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు, ఎన్జీవో సంస్థ సహకారంతో అవగాహన సదస్సును నిర్వహించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని,ఆ తర్వాత జిల్లాకు ఒకటి చొప్పున ఏడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
డీసీసీబీ ఆధ్వర్యంలో రూ.150 కోట్లతో నాగర్ కర్నూల్లో లోన్ మేళా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, డీసీసీబీ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.