విదేశాలకు దీటుగా టూరిజం స్పాట్లు : జూపల్లి కృష్ణారావు

విదేశాలకు దీటుగా టూరిజం స్పాట్లు : జూపల్లి కృష్ణారావు
  •     విదేశాల నుంచి టూరిస్టులు వచ్చేలా డెవలప్​ చేస్తాం 
  •     పాండవుల గుట్టలో రోప్​వే, స్లైక్లింగ్​ సౌకర్యాలు 
  •     పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు
  •     ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మంత్రి సీతక్కతో కలిసి పర్యటన 

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి /రేగొండ /వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌ (రామప్ప), వెలుగు : అమెరికా, దుబాయ్​, సింగపూర్​లాంటి దేశాలకు దీటుగా రాష్ట్రంలో టూరిజం స్పాట్లు ఉన్నాయని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పర్యటించారు.  ముందుగా భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కోటంచ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో రూ.12.15 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తిరుమలగిరి శివారులోని బుగులోని, పాండవుల గుట్టలను పరిశీలించారు.

గణపురం మండలంలోని గణపసముద్రం చెరువును, కోటగూళ్లను విజిట్ ​చేశారు. ములుగు జిల్లాలోని రామప్ప టెంపుల్‌‌‌‌‌‌‌‌, లక్నవరం సరస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలున్నాయని, వాటిని డెవలప్ ​చేసి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చేలా చేస్తామన్నారు. పాండవుల గుట్టలో రోప్​వేతో పాటు క్యాంటీన్ల నిర్మాణం, సైక్లింగ్ లాంటి వసతులు కల్పిస్తామన్నారు. గుట్ట వద్ద చేపట్టే అభివృద్ధి పనులకు అటవీశాఖ నుంచి అటంకాలు కలగకుండా సెక్రటేరియట్​లో మీటింగ్​ నిర్వహించనున్నట్లు తెలిపారు. రామప్ప లేక్ లో బోటింగ్ పెడతామన్నారు. వారానికి ఒక్కసారైనా మంత్రులు లేదా ఆఫీసర్లు పర్యాటక ప్రాంతాలను విజిట్​ చేసేలా ప్లాన్ ​చేసుకోవాలన్నారు.  

రామప్పలో రోప్‌‌‌‌‌‌‌‌వే : మంత్రి సీతక్క

రామప్ప సరస్సులో రోప్‌‌‌‌‌‌‌‌ వే ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. రామప్ప లేక్ నీళ్లలో ఐలాండ్ ఏర్పాటు చేసి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి  నిధులివ్వాలని పర్యాటక శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. నేషనల్ హైవేను మొక్కలతో అందంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. సమ్మక్క, సారలమ్మ ఆలయం దగ్గర స్మృతివనం ఏర్పాటు చేసి తల్లుల చరిత్రను రాయిస్తామన్నారు.  

దీనికోసం  25 ఎకరాల సర్కారు జాగాను గుర్తించామన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో దాదాపు రూ.90 కోట్లతో చేపట్టబోయే పనులకు సంబంధించిన ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్‌‌‌‌‌‌‌‌ టీఎస్‌‌‌‌‌‌‌‌ దివాకర మంత్రికి అందించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎంపీ కడియం కావ్య, టూరిజం చైర్మన్ ​పటేల్​ రమేశ్​రెడ్డి, ట్రేడ్ ​కార్పొరేషన్ ​చైర్మన్ ​అయిత ప్రకాశ్​రెడ్డి, కలెక్టర్​రాహుల్​ శర్మ పాల్గొన్నారు.