ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. యావత్ భారతదేశంతోపాటు ప్రపంచానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 2024, జూన్ 8వ తేదీ శనివారం నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలో ఉన్న బుద్ధవనంను మంత్రి జూపల్లి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బౌద్ధ టూరిజం సర్క్యూట్ లో తెలంగాణలోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని చప్పారు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున సాగర్ లోని బుద్ధవనంను సందర్శించామని మంత్రి తెలిపారు. బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జునసాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని కొనియాడారు.
ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజలు తప్పక సందర్శించాల్సిన ప్రాంతం బుద్ధవనమని చెప్పారు. నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి జూపల్లి తెలిపారు.