పానుగల్/నెట్వర్క్, వెలుగు : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భూమి లేని పేదలందరిని అర్హులుగా గుర్తించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. గురువారం పాన్గల్ గ్రామ సభలో, వనపర్తిలోని ఖిల్లాగణపురం మండలం సల్కెలాపూరు గ్రామంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికీ అందాలని సూచించారు. బయట ఎవరో చెప్పే మాటలు, దుష్ప్రచారాలను నమ్మవద్దని, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
అనంతరం 61 మందికి కల్యాణ లక్ష్మి, 2 షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ప్రత్యేక అధికారి ఉమాదేవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, ఏఓ రాజ వర్ధన్ పాల్గొన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు సాకిబండ తండా, కడ్తాల్ మండలం మక్త మాదారం, మాడ్గుల్ మండలం ఆర్కపల్లి లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. కోస్గి లో పురపాలక కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో 7వ వార్డులో సభ నిర్వహించారు. మద్దూరు మండలంలోని చెన్నారెడ్డి పల్లిలో గ్రామ సభకు మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి హజరై మాట్లాడారు.
రేవల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీడీవో నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ఆరు గ్యారంటీలో నాలుగు సంక్షేమ పథకాలు అర్హులైనవారికి అందించటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, పని జాబ్ కార్డులో తమ పేర్లు లేవని కొందరు అధికారులను నిలదీశారు. అర్హులైన వారు ఉన్నప్పటికీ అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇస్తున్నారని మండిపడ్డారు.
పెబ్బేరు మండలం పెంచికలపాడు, యాపర్ల గ్రామాలలో నిర్వహించిన గ్రామసభల్లో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సర్వతో ముఖాభివృద్ధి సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. కార్యక్రమంలో పెబ్బేరు ఏఎంసీ ఛైర్మన్ ప్రమోదిని, వైస్ ఛైర్మన్ విజయవర్దన్ రెడ్డి పాల్గొన్నారు.