కట్టిపడేసిన కాకతీయం

కట్టిపడేసిన కాకతీయం

బషీర్​బాగ్, వెలుగు: ప్రముఖ నాట్యగురువు పద్మశ్రీ డాక్టర్ పద్మజారెడ్డి నృత్య రూపకంతో ఆకట్టుకున్నారు. కాకతీయుల కళా వైభవం, రుద్రమదేవి పరామక్రమాన్ని తెలియజేస్తూ బుధవారం రవీంద్రభారతిలో ‘కాకతీయం పార్ట్– 3’ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. శివోహం, వీరరుద్రాయ, శివ తాండవం అంశాలు హైలెట్​గా నిలిచాయి. రుద్రమదేవి పాత్ర పోషించిన పద్మజారెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా సత్కరించారు.

నృత్య కళాకారులను అభినందించారు. కాకతీయుల చరిత్ర గొప్పదని, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడితోపాటు అనేక దేవాలయాలు, చెరువులు నిర్మించారని గుర్తుచేశారు. కాకతీయం నృత్యాన్ని తెలంగాణ నృత్యం గా గుర్తించేందుకు సీఎంతో చర్చించి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ఐసీసీఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ రాజశేఖర్, కళ పత్రిక సంపాదకులు డా.మహ్మద్ రఫీ, జి.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.