ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం : జూపల్లి కృష్ణారావు

ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం : జూపల్లి కృష్ణారావు
  •     కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీలను తప్పక నిలబెట్టుకుంటుంది
  •     నెల రోజులు కాకముందే బీఆర్ఎస్ లీడర్లు ప్రశ్నిస్తుండ్రు
  •     తొమ్మిదిన్నర ఏండ్లు అధికారంలో ఉండి వాళ్లు ప్రజలకు చేసిందేమీ లేదు​
  •      ఉమ్మడి జిల్లా పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు

పిట్లం, కోటగిరి, వెలుగు: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఆయా చోట్ల జరిగిన ప్రజాపాలన, గ్రామ సభల్లో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కోటగిరి మండలం కొత్తపల్లిలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరుల ప్రాణత్యాగాలతో చలించిపోయిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. 

మిగులు బడ్జెట్ తో అప్పగించిన రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులపాలు చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలపై రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం మోపారన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనతో విసిగిపోయిన జనం కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. ప్రమాణ స్వీకారం రోజే కాంగ్రెస్​ రెండు గ్యారంటీలను అమలు చేసినట్లు గుర్తు చేశారు. 
 

మిషన్ భగీరథ నిర్వహణ లోపం 
 

మిషన్ భగీరథ నిర్వహణలో అడుగడుగున లోపం కనిపిస్తోందని మంత్రి వాపోయారు. ఈ పథకం కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బుల్లో అధిక మొత్తం కాంట్రాక్టర్ల జేబుల్లోకే వెళ్లాయన్నారు. ఇప్పటికీ అనేక ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదన్నారు. జిల్లా ఇన్​చార్జి మంత్రిగా త్వరలో ఆర్​డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రతి ఇంటికీ నీరందేలా చూస్తానన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ భారతి, ఆర్డీవో రాజా గౌడ్, డీసీవో సింహాచలం పాల్గొన్నారు.
గ్యాస్​ కనెక్షన్​ లేని ఇల్లు ఉండకూడదు
 

పిట్లం:ఈ నెలాఖరు నాటికి జిల్లాలో గ్యాస్​కనెక్షన్​లేని ఇల్లు ఉండకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్​ను ఆదేశించారు. శనివారం మంత్రి జుక్కల్​ నియోజకవర్గంలో పర్యటించారు. బిచ్కుంద మండలం ఎల్లారం, పిట్లం మండలం కుర్తిలో ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారు. కుర్తిలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే బీఆర్ఎస్​ నేతలు ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదంటూ మాట్లాడుతున్నారన్నారు. 

నెల రోజుల కింద ప్రమాణ స్వీకారం రోజే రెండు గ్యారంటీలను షురూ చేసినట్లు గుర్తు చేశారు. తొమ్మిదిన్నర ఏండ్లలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని బీఆర్​ఎస్​కు కాంగ్రెస్​ను ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. జుక్కల్​నియోజకవర్గంలో పదేండ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. జుక్కల్​ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆరు గ్యారంటీలను వివరించారు. నియోజకవర్గ అభివవృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు.
 

కౌలాస్​ కోటను అభివృద్ధి చేస్తాం


చారిత్రాత్మక కౌలాస్​కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. జుక్కల్​పర్యటనలో భాగంగా ఆయన కౌలాస్​ కోటను పరిశీలించారు. స్థానికుల ద్వారా  కోట వివరాలు తెలుసుకున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎంతో చరిత్ర కలిగిన కౌలాస్​కోట శిథిలావస్థకు చేరిందని వాపోయారు. 

కోటను అభివృద్ధి చేసి వారసత్వ సంపదను రక్షిస్తామన్నారు. జుక్కల్​కు చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్ ​స్వాగతం పలికారు. నారాయణ్​ఖేడ్​ ఎమ్మెల్యే సంజీవ్​రెడ్డి, జడ్పీ సీఈవో సాయాగౌడ్ పాల్గొన్నారు.