- తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకెళ్లినట్టు: మంత్రి జూపల్లి
- రాజకీయ లబ్ధికోసమే సర్కార్‌పై గోబెల్స్ ప్రచారం
- బీఆర్ఎస్ భూస్థాపితం అయ్యిందని కామెంట్
బాన్సువాడ రూరల్, వెలుగు : ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిందని, ఇప్పటికైనా ఆయన ఏసీబీ విచారణకు హాజరుకావాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు సూచించారు. ఏసీబీ అధికారులకు సహకరించాలన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కొత్త ఎక్సైజ్ ఆఫీస్‌ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. అమృత్ 2.0 కింద తాగునీటి పనులకు శంకుస్థాపన చేసి ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘అసలు కేటీఆర్ తప్పు చేయకుంటే క్వాష్ పిటిషన్ ఎందుకు వేసినట్టు? స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికి బీఆర్ఎస్ లీడర్లంతా ఈ కేసు మీద రచ్చ చేస్తున్నారు. అధికారం కోల్పోయామన్న బాధలో ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నరు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో బీఆర్ఎస్ ఇప్పటికే భూ స్థాపితం అయ్యింది. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది ఓ కలే’’అని మంత్రి జూపల్లి అన్నారు.
కాంగ్రెస్ పార్టీయే శ్రీరామ రక్ష
దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే శ్రీరామ రక్ష అని మంత్రి జూపల్లి అన్నారు. ‘‘తెలంగాణలో ఇందిరమ్మ పాలన కొనసాగుతున్నది. రైతు రుణమాఫీ, మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, పేదలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నం. త్వరలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తాం. గత బీఆర్ఎస్ సర్కార్ రూ.8లక్షల కోట్ల అప్పు చేసింది.
అసలు, వడ్డీ కలిపి నెలకు రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తున్నది’’అని మంత్రి జూపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు.