ఆరోగ్య మహిళ పథకం తెచ్చిన ఘనత కేసీఆర్ ది : మంత్రి గంగుల

ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ దని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని కరీంనగర్ నుండి ప్రారంభించిన మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కరీంనగర్ బుట్టిరాజారాం కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో "ఆరోగ్య మహిళ" కార్యక్రమాన్ని మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ కలిసి ఇవాళ ప్రారంభించారు. ఆడబిడ్డల సంరక్షణ, ఆరోగ్యం కోసం ఇప్పటివరకు ఏ సీఎం ఈ విధంగా ఆలోచించలేదని తెలిపారు. మహిళా ఆరోగ్యంగా ఉంటే..ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుందని కేసీఆర్ ఆరోగ్య మహిళా పథకాన్ని తీసుకువచ్చారన్నారు.

ఆరోగ్య మహిళ పథకం ఇటు మన దేశంలోనే కాదు ప్రపంచంలోని ఏ దేశంలో కూడా లేదని మంత్రి గంగుల చెప్పారు. గొప్ప గొప్ప పథకాలన్నీ తెలంగాణలోనే అమలవుతున్నాయని వ్యాఖ్యానించారు. "తల్లి నవ్వితే ఇల్లు నవ్వుతుంది.. ఇల్లు నవ్వితే పల్లె నవ్వుతుంది.. పల్లె నవ్వితే పట్టణం నవ్వుతుంది..  పట్టణం నవ్వితే తెలంగాణ నవ్వుతుంది.. తెలంగాణ నవ్వితే సీఎం కేసీఆర్ నవ్వుతారు" అని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.