
న్యూఢిల్లీ: లడఖ్‌లో చైనా దురాక్రమణలను ఎప్పటికీ అంగీకరించబోమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. లడఖ్‌లోని కొంత భాగాన్ని కలుపుకుని చైనాలోని హోటాన్ ప్రాంతంలో ఆ దేశం రెండు కౌంటీలను నిర్మించిన విషయం కేంద్రానికి తెలుసా? అంటూ లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘చైనాలోని హోటాన్ ప్రాంతంలో ఆ దేశం కొత్తగా రెండు కౌంటీలను నిర్మించిన విషయం తెలుసు.
ఈ కౌంటీల్లో కొంత భాగం లడఖ్ పరిధిలోకి వస్తుంది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడాన్ని ఎన్నడూ అంగీకరించం. ఈ కొత్త కౌంటీల ఏర్పాటు భారత సార్వభౌమాధికారంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఇలాంటి దురాక్రమణలకు చట్టబద్ధత ఉండదు” అని అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే దౌత్యమార్గాల ద్వారా చైనాకు తెలియజేశామని చెప్పారు. చైనా తీరుపై నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. ‘‘బార్డర్ వెంబడి మౌలిక సదుపాయాలను చైనా అభివృద్ధి చేసుకుంటున్న విషయం కూడా కేంద్రానికి తెలుసు.
దీనిపై దృష్టిసారించాం. మనం కూడా బార్డర్ వెంబడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేస్తున్నాం. ఇందుకోసం గత పదేండ్లలో బడ్జెట్‌లో నిధులను పెంచాం. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో)కు ఇచ్చే నిధులను మూడు రెట్లు పెంచాం. గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున రోడ్లు, బ్రిడ్జీలు, టన్నెల్స్ నిర్మించాం” అని వెల్లడించారు. చైనా చర్యలను కేంద్రం ఎప్పటికప్పుడు గమనిస్తున్నదని.. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.