
- ఇయ్యాల జయంతి సందర్భంగా నాంపల్లి నుంచి ట్యాంక్ బండ్ వరకు బైక్ ర్యాలీ
హైదరాబాద్ / పద్మారావునగర్, వెలుగు: అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. ఆదివారం అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేసి, అలంక రించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అంబేద్కర్ జయంతి(ఈ నెల14)ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ లోని సీతాఫల్మండి, బంజారాహిల్స్జీవీకే సర్కిల్ లో ఆయన విగ్రహాలను కిషన్రెడ్డి పాలతో శుద్ధి చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రధాని మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. అంబేద్కర్ కృషిని, వారసత్వాన్ని గౌరవిస్తూ తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో పెట్టామని, అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న 5 ముఖ్యమైన ప్రదేశాలను ‘పంచతీర్థాలు’గా డెవలప్ చేశామన్నారు.
వాటిని దేశ ప్రజలంతా ఆ ప్రాంతాలను సందర్శించి నివాళులర్పించేలా తీర్చిదిద్దామన్నారు. వీటిలో అంబేద్కర్ జన్మభూమి(మవు, మధ్యప్రదేశ్)లో స్మారక చిహ్నం కూడా ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, మాజీ మేయర్బండ కార్తీక రెడ్డి, సికింద్రాబాద్ బీజేపీ కన్వీనర్ కందాడి నాగేశ్వర్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు సారంగపాణి, టి.రాజశేఖర్ రెడ్డి, ఎస్. రాజు, శ్యాంసుందర్ మద్దెర్ల, ప్రభుగుప్తా పాల్గొన్నారు.
నేడు బీజేపీ బైక్ ర్యాలీ
అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం భారీ బైక్ ర్యాలీ చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీసు నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ చేపట్టనున్నారు. ఉదయం 9 గంటలకు బీజేపీ ఆఫీస్ నుంచి ర్యాలీ ప్రారంభమై ట్యాంక్ బండ్ వరకు కొనసాగనుంది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నేతలు నివాళులర్పిస్తారు. ర్యాలీలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొనున్నారు.