- పోలింగ్కాగానే కేసీఆర్, కేటీఆర్ ఎవరినీ కలవరు
- వారిద్దరు ఫామ్‌హౌస్‌లు దత్తత తీసుకోవాలని ఎద్దేవా
యాదాద్రి, వెలుగు : కూతురు కవితతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ వారం రోజులుగా అక్కడే ఎందుకు మకాం వేశారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చి బీఆర్ఎస్ ఏర్పాటు చేశారన్నారు. పార్టీ పేరు మార్చినా కేసీఆర్‌కు ఒరిగేదేమీ ఉండదని విమర్శించారు. శనివారం ఆయన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయగానే.. కేటీఆర్‌కు మునుగోడును దత్తత తీసుకోవాలని అనిపించిందని ఎద్దేవా చేశారు. పోలింగ్ అయిపోయిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ ఎవరికీ కనబడరని, ఎవరినీ కలవరని తెలిపారు. వాళ్లిద్దరూ ఫామ్‌హౌస్‌లు దత్తత తీసుకొని అక్కడే ఉండాలని ఎద్దేవా చేశారు. గులాబీ దండును తరిమికొట్టి.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. చైతన్యవంతులైన మునుగోడు ప్రజలు బీజేపీని గెలిపించి, టీఆర్ఎస్ను ఓడిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందని తెలిపారు. ఎనిమిదేండ్లలో కేసీఆర్ తన కుటుంబ ప్రయోజనాలు తప్ప ప్రజలను పట్టించుకోలేదన్నారు. సీఎం కుర్చీ తన చెప్పుతో సమానమని చెప్పిన కేసీఆర్, ఆ కుర్చీలోంచి కిందకు దిగడం లేదన్నారు. తాను కిందికి దిగగానే.. కొడుకు కేటీఆర్‌ను ఎక్కించాలని ప్రయత్నిస్తున్నాడన్నారు. పెంచిన ఎస్టీ రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేయకుంటే అధికారంలోకి రాగానే బీజేపీ సర్కారు అమలు చేస్తుందని చెప్పారు.
వానలోనే ప్రచారం
చౌటుప్పల్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వాన కురిసింది. వాన కురుస్తున్నా గొడుగు సాయంతో ఆయన ప్రచారం కొనసాగించారు. కాలికి గాయమైన కారణంగా ప్రచారరథం మీద నుంచే ప్రసంగించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు తదిరులు ఉన్నారు.
ఇయ్యాల జనగామలో డీబీయూ ఓపెనింగ్
హైదరాబాద్: బ్యాంకింగ్ సేవలు మారుమూల ప్రాంతాలకు చేరవేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆదివారం దేశవ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డీబీయూ) ప్రారంభిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ వీటిని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 75 డీబీయూలలో మూడు తెలంగాణలో, రెండు ఏపీలో ఉన్నాయి. సిరిసిల్ల, ఖమ్మం, జనగామ లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జనగామలో జరిగే ఓపెనింగ్కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.