పనజీ, వెలుగు: ప్రపంచంలోనే ఆధ్యాత్మికతకు ఇండియా పుట్టినిల్లు అని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మదర్ ఆఫ్ డెమోక్రసీగా ఉన్న భారత్.. ప్రపంచ పర్యాటకులకు ఆధ్యాత్మిక గమ్యస్థానంగా నిలుస్తోందన్నారు. ఇస్కాన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారి, స్వామి నారాయణ్, ఈషా ఫౌండేషన్, రామకృష్ణ మిషన్, మాతా అమృతానందమయి సహా వందల కొద్ది ఆధ్యాత్మిక సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని చెప్పారు. ఘన చరిత్ర, వారసత్వం కలిగిన ఇండియా.. ఇప్పుడు ప్రపంచ పటంపై ‘అతిథి దేవో భవ’అంటూ పర్యాటకులను ఆహ్వానిస్తోందని పేర్కొన్నారు. గోవా రాజధాని పనజిలో జరుగుతున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్‌లో మంగళవారం ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జరిగే జీ–20 మీటింగ్స్‌కు గోవా రోడ్ మ్యాప్‌ను ఆయన ప్రకటించారు. జీ20 దేశాలతో పాటు ఆహ్వానిత దేశాల్లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఎదుర్కొనే సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలతో ఈ రోడ్ మ్యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు మూడు జీ-20 టూరిజం వర్కింగ్ సమావేశాలు జరిగాయని, మొదటిది రణ్ ఆఫ్ కచ్(గుజరాత్), రెండవది సిలిగురి (పశ్చిమ బెంగాల్), మూడో మీటింగ్ శ్రీనగర్ (జమ్మూ-కాశ్మీర్), నాలుగో మీటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోందని, చివరి మీటింగ్ వారణాసిలో ముగుస్తుందని చెప్పారు. భారతదేశ పర్యటన ఇక్కడి ఆధ్యాత్మక క్షేత్రాల సందర్శన లేకుండా సంపూర్ణం కాదని అభిప్రాయపడ్డారు. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు భారత్ జన్మస్థానం అని పేర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న ప్రపంచ పర్యాటకం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని చెప్పారు. ఈ క్రమంలో జీ20 ప్రెసిడెన్సీని భారత్ చేపట్టి ప్రపంచ పర్యాటక రంగ వృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నదని తెలిపారు.
గోవా టూరిజం అభివృద్ధికి కృషి..
గోవాను ప్రపంచానికి టూరిజం డెస్టినేషన్‌గా అభివృద్ధి చేస్తున్నామని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. షిప్ తయారీ ఇండస్ట్రీ కూడా ఇక్కడ వృద్ధి చెందడం గర్వంగా ఉందని చెప్పారు. ఇందుకోసం క్రూయిజ్ టూరిజంతో పాటు వివిధ రంగాల్లో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉండేలా గోవా టూరిజం పాలసీని రూపొందించినట్లు తెలిపారు. పోర్టులను ఎగుమతులు, దిగుమతుల కోసమే కాకుండా పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం గోవా నుంచి ముంబై వరకు ఉన్న క్రూయిజ్ టూరిజాన్ని దేశవ్యాప్తంగా అన్ని పోర్టులకు అనుసంధానించేలా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. గోవాలో మెరైన్ క్లస్టర్ మెరైన్ రంగానికి మరింత ఊతం ఇస్తుందని చెప్పారు. త్వరలో గోవాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే గోవా పోలార్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారని వివరించారు.